ఒక భాష నుంచి ఓ సినిమాను మరో భాషలోకి రీమేక్ చేస్తున్నారంటే అది కచ్చితంగా హిట్టు సినిమా అయ్యుంటుందనే అనుకుంటాం. మరీ పెద్ద హిట్టు కాకపోయినా ఓ మోస్తరుగా ఆడిన చిత్రాన్నే రీమేక్ కోసం ఎంచుకుంటారు. ఐతే ఆశ్చర్యకరంగా తెలుగులో డిజాస్టర్ అయిన ఓ సినిమా ఇప్పుడు హిందీలోకి వెళ్లబోతోంది. ఆ చిత్రమే.. ఊసరవెల్లి.
ఊసరవెల్లి ఏడేళ్ల కిందట జూనియర్ ఎన్టీఆర్ హీరోగా సురేందర్ రెడ్డి రూపొందించిన చిత్రమిది. ఎన్టీఆర్ పూర్తిగా అవతారం మార్చేసి ప్రయోగాత్మక కథతో చేసిన ఈ సినిమా అంచనాల్ని అందుకోలేకపోయింది. ప్రథమార్ధంలో కామెడీ వర్కవుటైనా, ఎన్టీఆర్ క్యారెక్టర్ భిన్నంగా అనిపించినా.. ఓవరాల్‌గా సినిమా జనాలకు రుచించలేదు.
ఐతే ఈ సినిమా ఫలితంతో సంబంధం లేకుండా దీన్ని హిందీలో రీమేక్ చేయడానికి ఇంతకుముందు అక్షయ్ కుమార్ ఆసక్తి చూపించాడు. కొన్ని రోజులు రీమేక్ గురించి చర్చ నడిచింది. కానీ తర్వాత చల్లబడిపోయింది. ఐతే ఇప్పుడు అగ్ర నిర్మాణ సంస్థ టిప్స్.. ఊసరవెల్లి రీమేక్ హక్కులు సొంతం చేసుకోవడం విశేషం. ఈ కథ ఆధారంగా కొందరు రచయితలతో కలిసి హిందీ రీమేక్ కోసం స్క్రిప్టును తయారు చేసే పనిలో ఉందట ఆ సంస్థ.
ఊసరవెల్లిలో సైడ్ క్యారెక్టర్ చేసిన పాయల్ ఘోష్ కూడా ఈ వార్త గురించి స్పందిస్తూ హర్షం వ్యక్తం చేసింది. మరి హిందీ వెర్షన్లో ఎన్టీఆర్, తమన్నాల పాత్రలు ఎవరు చేస్తారో.. ఈ రీమేక్‌ను ఎవరు డైరెక్ట్ చేస్తారో చూడాలి. సెకండాఫ్‌ను సరిదిద్దుకుని కథకు కొంచెం మెరుగులు దిద్దుకుంటే హిందీలో వర్కవుటయ్యే సినిమానే ఊసరవెల్లి.