తెలుగు రాష్ట్రాలో ఎన్టీవోడు.. ఎన్టీఆర్.. తారక రాముడు.. ఇలా ఒక్కటేంటి ఎన్నో పేర్లు.. రాజసానికి నెలవుగా మారిన నైజానికి సంకేతాలు అవి. ఎన్టీఆర్ కు రాజకీయాల్లో తిరుగులేదు. వ్యక్తిత్వం రీత్యా ఆయన కొన్ని విషయాల్లో నిబద్ధతతోనే ఉన్నారు. సంక్షోభ కాలాలలోనూ ఆయన నిబ్బరంగానే ఉన్నారు.
ఆయన దృష్టిలో పాలన అంటే తక్షణ న్యాయం అని ఎన్టీఆర్ పుస్తక రచయితలు అంటుంటారు. ఎన్టీఆర్ జీవితం గురించి తెలిసిన వారు కూడా వేగంగా నిర్ణయాలు తీసుకోవడం వాటిని అమలు చేయడంలో ఎన్టీఆర్ సాటి మరొకరు లేరు అని కూడా అంటారు.ఆ రోజు జరిగిన పరిణామాల్లో నిర్ణయాల మార్పులో కొందరి ప్రభావం ఉన్నా కూడా కడదాకా ఎన్టీఆర్ తన వ్యక్తిత్వాన్ని నమ్ముకున్నారు. ఆత్మ గౌరవం చాటుకున్నారు.
ముఖ్యంగా ఎన్టీఆర్ కు ఉత్తరాంధ్ర అంటే సెంటిమెంట్.. ఆయన్ను సినిమాల పరంగా రాజకీయ పరంగా నెత్తిన పెట్టుకుంది ఈ ప్రాంతం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకూ చాలా మంది ఆ సెంటిమెంట్ ను ఎప్పటికప్పుడు బ్రేక్ చేయాలని చూస్తుంటారు. కొన్ని సార్లు సక్సెస్ అయ్యారు కూడా ! అదే సెంటిమెంట్ ను రాజశేఖర్ రెడ్డి, వారి కుమారుడు జగన్ మోహన్ రెడ్డి కొనసాగించారు కూడా !
ఎన్టీఆర్ అంటేనే ఓ గొప్ప మాస్ లీడర్ అంటారు. ప్రసంగాల్లో తిరుగులేని వాగ్ధార ఆయన సొంతం. తెలుగు పలుకుబడి విపరీతం అయిన ప్రాధాన్యం ఇచ్చే నాయకులు ఆయన. ముఖ్యంగా ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలను ఎదిరించి, ఎదిగివచ్చిన నేత. పాలన పరంగా కూడా సంస్కరణాయుత చర్యలు వేగం వేగంగానే తీసుకున్నారు. ఆ రోజు ఆయన వెంట నడిచిన ఐఏఎస్ అధికారులు ఇప్పటికీ కూడా కొన్ని చర్యలను కొన్ని నిర్ణయాలను మెచ్చుకుంటారు.
ఆడ బిడ్డలకు ఆస్తి లో సమాన హక్కు కల్పించారు. ఇక వారి బిడ్డ హరి కృష్ణ కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆర్టీసీలో మహిళా కండక్టర్ల నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఓ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజు మండల వ్యవస్థను ఎన్టీఆర్ రద్దు చేశారు. అదేవిధంగా కిలో రెండు రూపాయలకే పేదవాడికి బియ్యం అందించారు. ఈ నిర్ణయాలతో ఎన్టీఆర్ ఆంధ్రులకు అన్నగా మారిపోయాడు. ముఖ్యంగా ఆడబిడ్డలకు ఆస్తిహక్కే దీనిలో ప్రధానమైనది.
తెలుగు భాష వ్యాప్తి కోసం, జాతి ప్రగతి కోసం పరితపించారు. గురుకుల విద్యకు ఆద్యులుగా నిలిచారు.ఎస్సీ,ఎస్టీ, బీసీ విద్యార్థుల చదువు కోసం ఆ విధంగా ప్రభుత్వం తరఫున జిల్లాకో గురుకులం నెలకొల్పి ఆదర్శం అయ్యారు.పాలనలో తెలుగు ప్రాధాన్యాన్ని, వినియోగాన్నీ పెంచిన ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే మాతృభాష కు ఆయన ఇచ్చినంత గౌరవం కానీ దక్కించిన ప్రాభవం కానీ మరో ముఖ్యమంత్రి ద్వారా సాధ్యం కాలేదు.