తెలుగు వారి ఆరాధ్య దైవం.. అందరి అన్నగారు ఎన్టీ రామారావు శత జయంతి వేడుకలు.. దుబాయ్‌లో ఘనంగా జరిగాయి. ఎన్నారై టీడీపీ సెల్ ఆధ్వర్యంలో దుబాయ్‌లోని అల్ ఖాసిస్ లో ఉన్న ఉడ్ లెమ్ పార్కు స్కూల్లో నిర్వహించిన ఈ వేడుకలకు ఏపీ నుంచి పలువురు నాయకులు పాల్గొన్నారు.
వీరిలో మాజీ మంత్రి, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ ఎమ్మెల్యే, తెలుగు మహిళ విభాగం అధ్యక్షురాలు వంగలపూడి అనిత, మాజీ మంత్రి కేఎస్ జవహర్, తెలంగాణ తెలుగుదేశం నాయకుడు నర్సిరెడ్డి మరియు ప్రముఖ పారిశ్రామికవేత్త రవి మందలపు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీనియర్ నాయకుడు బుచ్చ చౌదరి మాట్లాడుతూ, ఎన్టీఆర్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. రాజకీయాల్లో అన్నగారు చూపిన బాటలో తాను నడిచానని, అందుకే ప్రజలకు చేరువయ్యానని చెప్పారు. దాదాపు 4 దశాబ్దాలుగా తాను రాజకీయాల్లో ఉన్నానని గోరంట్ల బుచ్చయ్య వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో అన్నగారితో తన ప్రయాణం సుదీర్ఘంగా సాగిందన్నారు. రాజకీయంగా బీసీలకు, వెనుకబడిన వర్గాలకు అన్నగారు ఇచ్చిన ప్రాధాన్యం అంతా ఇంతా కాదన్నారు. బీసీలకు ఈ రోజు అనేక పదవులు ద క్కుతున్నాయన్నా.. ఆర్థికంగా ఆ వర్గాలు బలోపేతం అయ్యాయయన్నా.. అన్నగారు తీసుకున్న నిర్ణయా లేనని తెలిపారు. అదేవిధంగా పేదలకు ఎలా చేరువ కావాలో వారిని రాజకీయంగా ఎలా ఆదుకోవాలో కూడా తాను అన్నగారి నుంచి నేర్చుకున్నట్టు చెప్పారు.
తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత మాట్లాడుతూ, ఎన్టీఆర్‌తో ప్రత్యక్షంగా తనకు పరిచయా లు లేకపోయినా, ఆయన అడుగు జాడల్లో తాను నడుస్తున్నానని చెప్పారు. శక పురుషుడు జన్మించిన వందేళ్ల తర్వాత నేటి యువత ఎన్టీఆర్ గురించి స్మరించుకోవడం గొప్ప విషయమని పేర్కొన్నారు.
మాజీ మంత్రి కేఎస్ జవహర్ మాట్లాడుతూ, ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువేనన్నారు. తనలాంటి దళితులకు ఆయన రాజకీయంగా ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు. ఈ సందర్భంగా జవహర్ కవితను చదివి వినిపించారు. తనకు అన్నగారితో బుద్ద పూర్ణిమ సందర్భంగా జరిగిన పరిచయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు.
ప్రముఖ తెలంగాణ తెలుగుదేశం నాయకుడు నర్సిరెడ్డి ప్రసంగిస్తూ తనకు మాత్రమే సాధ్యమైన పంచులతో అన్న గారి మీద అభిమానాన్ని చాటుతూ ఉర్రుతలూగించారు.
అమెరికా లో నివసిస్తున్న ప్రముఖ పారిశ్రామికవేత్త రవి మందలపు ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ, ఎన్టీఆర్ వేసిన బాటలో అనేక మంది రాజకీయాలలోకి వచ్చారని తెలిపారు. ప్రజకలు సేవ చేసే భాగ్యం కలగడాన్ని ఎన్టీఆర్ ఎంతో గౌరవంగా భావించారని తెలిపారు. రూపాయి జీతం తీసుకున్న ఏకైక ముఖ్యమంత్రి ఆయనేనని తెలిపారు.
అన్నగారి శత జయంతి సభకు స్థానిక తెలుగు ప్రజలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. రాజకీయాలకు అతీతంగా ఎక్కువ సంఖ్యలు పాల్గొన్నారు. అన్నగారి స్మృతులను మననం చేసుకున్నారు.
చివరిలో ప్రముఖ పారిశ్రామికవేత్త రవి మందలపుని దుబాయ్ టీడీపీ అభిమానులు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమాన్ని విశ్వేస్వర రావు, దుబాయ్ ఎన్నారై అధ్యక్షులు, నిరంజన్ ఉపా అధ్యక్షులు, వాసు రెడ్డి, కార్యదర్శి, భాషా, గల్ఫ్ టీడీపీ సభ్యులు తదితరులు విజయవంతంగా నడిపించారు.