తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం వెర్రి తలలు వేస్తోంది. ఈ అంశంలో వేలెత్తి చూపించాలంటే వైసీపీనే కారణమన్న మాట బలంగా వినిపిస్తోంది. తమ రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేస్తూ.. ఎంత విచ్చలవిడిగా వ్యాఖ్యలు చేస్తారో తెలిసిందే అంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో.. మీరేనా పోస్టులు.. వీడియోలు పెట్టేది అంటూ.. టీడీపీ సానుభూతిపరుల పోస్టులు కౌంటర్ గా వెలువడుతున్నాయి. తాజాగా గన్నవరానికి చెందిన ఒక ప్రవాసాంధ్రుడ్ని గన్నవరం పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై అసభ్యకరరీతిలో పోస్టులు పెడుతున్నారన్న ఆరోపణలతో కోటిరత్న అంజన్ ను అరెస్టు చేశారు. బుధవారం తెల్లవారుజామున అతడ్ని అరెస్టు చేసి.. మొబైల్.. ల్యాప్ టాపో తో పాటు ట్యాబ్ ను స్వాధీనం చసుకున్నారు. రెండు వర్గాల మధ్య శత్రుత్వం పెంచేలా సామాజిక మాధ్యమాల్లోఅసభ్యకర పోస్టులు పెడుతున్నారన్నది అతడి మీద ఆరోపణ.
అమెరికాలో ఎంఎస్ చదివి.. అక్కడే కొంతకాలం ఉద్యోగం చేసిన అతను కొంతకాలం తిరిగి వచ్చారు. గన్నవరంలోని తల్లిదండ్రులకు వద్ద ఉంటున్నారు. గన్నవరానికి చెందిన ఉల్లిపాయల కమిషన్ వ్యాపారి నాగసూర్య ప్రశాంత్ ఇచ్చిన కంప్లైంట్ తో పోలీసులు అంజన్ మీద ఐసీపీ సెక్షన్ 153ఏ కింద కేసు నమోదు చేశారు.
అతడ్ని సుదీర్ఘంగా విచారించినట్లు చెబుతున్నారు. సీఎం జగన్ కు వ్యతిరేకంగా పెట్టిన పోస్టుల వెనుక ఎవరైనా టీడీపీ నేతల ప్రమేయం ఉందా? ఇలా పోస్టులు పెడుతున్నందుకు డబ్బులుఇస్తున్నారా? లాంటి ప్రశ్నలు అడగ్గా.. తాను వ్యక్తిగతంగానే పోస్టులు పెట్టినట్లుగా పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఇకపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టొద్దంటూ కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం అదనపు జూనియర్ సివిల్ జడ్జి శిరీష నివాసానికి తీసుకొచ్చి ఆమె ఎదుట హాజరుపర్చారు. అంజన్ ను రిమాండ్ కు ఇవ్వాలని కోరగా.. స్టేషన్ బెయిల్ సెక్షన్ కావటంతో సొంత పూచీకత్తుపై విడుదల చేయాలని ఆదేశించారు.
అదే సమయంలో అంజన్ ను హోమో సెక్సువల్ గా పేర్కొంటూ పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న వైనంపై పలువురు తప్పు పడుతున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు పూర్తిగా విరుద్ధంగా ఉన్న ఈ తీరు సరి కాదని.. అది వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించే వైనంగా చెబుతున్నారు. ఇలా వ్యక్తిగత వివరాల్ని పేర్కొనటం ద్వారా పోలీసులు తప్పు చేశారని.. చట్ట విరుద్ధంగా న్యాయవర్గాలు పేర్కొంటున్నాయి. సోషల్ మీడియాలో ప్రభుత్వానికి.. సీఎంకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన వాటిల్లో హద్దులు దాటిన వారిపై చర్యలు తీసుకోవటం తప్పేం కాదు. అదే సమయంలో విపక్ష నేతల మీదా.. వారి కుటుంబ సభ్యుల మీదా పోస్టులు పెట్టే వారి మీదా ఇలాంటి చర్యలే ఉండాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.