విపక్ష పార్టీల నేతలపై అధికార పార్టీ నేతలు విమర్శలు గుప్పించడం సర్వ సాధారణం. అయితే, ఆ ఆరోపణలు, విమర్శలు కొన్ని సార్లు అధికార పార్టీ నేతలకు చిక్కులు తెచ్చిపెడుతుంటాయి. అధికారం ఉంది కదా అని ఇష్టారీతిన ఆరోపణలు చేస్తే కొన్ని సార్లు పరువు నష్టం దావాల కేసుల్లో కోర్టు మెట్లు కూడా ఎక్కాల్సి వస్తుంది. ఒకవేళ పరువు నష్టం కేసులను లైట్ తీసుకొని వాయిదాలకు రాకుండా నిర్లక్ష్యం చేస్తూ విచారణకు హాజరు కాకుంటే కోర్టు ఆగ్రహాన్ని కూడా చవిచూడాల్సి వస్తుంది.
ఈ తరహాలోనే వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు, ఏపీ వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబులు చేసిన వ్యాఖ్యలు వారిని ఇక్కట్లపాలు చేసేలా ఉన్నాయి. వారిద్దరూ హెరిటేజ్ సంస్థ వేసిన పరువునష్టం కేసులో విచారణకు హాజరుకాకపోవడంతో వారికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ కావడం సంచలనం రేపింది. ఈ కేసు విచారణ ఈ నెల 24కు ప్రజాప్రతినిధుల కోర్టు వాయిదా వేసింది.
గతంలో హెరిటేజ్ సంస్థపై కన్నబాబు, అంబటి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో వారిద్దరిపై ఆ సంస్థ పరువునష్టం దావా వేసింది. ప్రజాప్రతినిధుల కోర్టులో ఆ దావా విచారణ జరుగుతోంది. ఫిబ్రవరి 5న వారిద్దరూ విచారణకు రావాలని కోర్టు ఆదేశించినా వారు హాజరు కాలేదు. వారితోపాటు హెరిటేజ్ అధికారి సాంబమూర్తి కూడా విచారణకు గైర్హాజరయ్యాడు. దీంతో ఆ ముగ్గురిపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.
కన్నబాబు, అంబటి రాంబాబులు వచ్చే వాయిదాకు రావాల్సిందేనని చెబుతూ వారిద్దరిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకు సంబంధించిన కేసుల విచారణ త్వరితగతిన పూర్తయ్యేందుకు కేంద్రం ప్రజా ప్రతినిధుల కోర్టు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అక్కడ హెరిటేజ్ పై కన్నబాబు, రాంబాబుల వ్యాఖ్యల కేసు కూడా విచారణకు వచ్చింది. అయితే, కన్నబాబు, అంబటి విచారణకు హాజరై వివరణ ఇచ్చి ఉంటే నాన్ బెయిలబుల్ వారెంట్ దాకా వ్యవహారం వెళ్లి ఉండేది కాదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇలా చాలామంది ప్రజా ప్రతినిధులు కోర్టులు, నోటీసులు, వాయిదాలు లైట్ తీసుకొని…ఆ తర్వాత ఇలా నాన్ బెయిలబుల్ వారెంట్ల వరకు తెచ్చుకుంటారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.