ప్రముఖ సినీ నటి, మాజీ ఎంపీ జయప్రద దేశ రాజకీయాలలో సుపరిచితురాలు. తెలుగింటి ఆడపడుచు అయినప్పటికీ జయప్రద ఉత్తరాది రాజకీయాలలో బాగా పాపులర్ అయ్యారు. యూపీలోని రాంపూర్ నియోజకవర్గం నుంచి పలుమార్లు ఆమె పోటీ చేశారు. ఈ క్రమంలోనే గత ఎన్నికల్లో బీజేపీ తరఫున రాంపూర్ నుంచి పోటీ చేసిన జయప్రద…ఎన్నికల కోడ్ ఉల్లంఘించిందంటూ కేసు నమోదైంది.
ఈ కేసులో జయప్రదపై రాంపూర్ కోర్టు తాజాగా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. చాలాసార్లు విచారణకు రావాలని కోరినా జయప్రద హాజరు కాలేదు. కోర్టు నోటీసులిచ్చినా ఫలితం లేకపోవడంతో తాజాగా కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అంతేకాదు, జనవరి 10 లోపు ఆమెను కోర్టులో హాజరుపరచాలని పోలీసులను ఆదేశించింది. దీంతో, జయప్రద కోసం ప్రత్యేక పోలీసు బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. జయప్రద మిస్సింగ్ అంటూ జాతీయ మీడియా కోడై కూస్తోంది. అయితే, నాన్ బెయిలబుల్ వారెంట్ పై జయప్రద స్పందించాల్సి ఉంది.