ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైడ్రామా కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. 2021 ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆసక్తి చూపుతుండగా…కరోనా సెకండ్ వేవ్ వచ్చే అవకాశమున్న నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించడం సరికాదని ప్రభుత్వం చెబుతోంది. ఈ వ్యవహారం కోర్టులో ఉన్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరిలో స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలన్న ఎన్నికల సంఘం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీర్మానం చేసింది. డిప్యూటీ సీఎం ఆళ్ల నాని ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి సభ ఆమోదం తెలిపింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఏపీలో స్థానిక ఎన్నికలు నిర్వహించలేమని సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు.
ఏపీలో కరోనా కేసులు పూర్తిగా తగ్గలేదని, త్వరలోనే కరోనా సెకండ్ వేవ్ వచ్చే అవకాశముందని ఆరోగ్య శాఖామంత్రి ఆళ్ల నాని సభకు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు పరిస్థితులు అనుకూలంగా లేవని, అందువల్ల ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని సభకు తెలిపారు. కరోనా సెకండ్ వేవ్ ప్రమాదం పొంచి ఉందని, ఈ సమయంలో ఎన్నికలు నిర్వహించి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడలేమని అన్నారు. తమ ప్రభుత్వానికి ప్రజల భద్రతే ముఖ్యమని, ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఎన్నికలపై ఈసీ నిర్ణయం తీసుకుందని అన్నారు. ఏపీలో పరిస్థితులు ఎన్నికల నిర్వహణకు అనుకూలంగా ఉన్నపుడే ఎన్నికలు నిర్వహించడం సాధ్యమవుతుందని అన్నారు. కాగా, 5 రోజులపాటు సాగిన ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగిశాయి. 19 బిల్లులకు సభలో ఆమోదం లభించింది. ఏపీ అసెంబ్లీని నిరవధిక వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ తమ్మినేని సీతారాం తెలిపారు.