చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవటం అంటే ఇదేనేమో?
వణికిస్తున్న కోవిడ్ కు చెక్ పెట్టే టీకాలు మన దగ్గరే తయారవుతున్నాయి.. మిగిలిన వారి కంటే రూపాయి ఎక్కువ ఇస్తాం.. మాకే ముందు అమ్మండని అడిగి ఉంటే ఎలా ఉండేది? ఎక్కడెక్కడి దేశాలో మన దేశీయ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటుంటే.. చేష్టలుడిగినట్లుగా ఉండిపోవటమే కాదు.. ఉత్పత్తి సామర్థ్యానికి ఆర్థిక సాయాన్ని ఇస్తారా? అని నోరు తెరిచి అడిగిన సీరం సంస్థకు సమాధానం చెప్పటానికి కేంద్రంలోని మోడీ సర్కారుకు ఎంత కాలం పట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
దేశంలో సెకండ్ వేవ్ విపరీతంగా వ్యాపించి.. వ్యాక్సిన్ కోసం ఒత్తిడి తీవ్రతరం అవుతున్న వేళ.. నిద్ర లేచిన కేంద్రం ఇప్పుడు టీకాల మీద పరిమితుల్ని పెడుతోంది.
తాజాగా కోవిషీల్డ్ కు చెందిన 50 లక్షల డోసుల్ని ఎగుమతి చేసుకునేంతదుకు సీరం సంస్థ కేంద్రాన్ని అనుమతి కోరింది. బ్రిటన్ కు ఈ 50 లక్షల టీకాల ఎగుమతిని కోరగా.. అందుకు కేంద్ర సర్కారు నిర్మొహమాటంగా నో చెప్పేసింది.
దేశంలో తయారయ్యే వ్యాక్సిన్లు మొత్తం తొలుత దేశ అవసరాల్ని తీర్చటానికి సరఫరా చేయాలని స్పష్టం చేసింది. తాజాగా ఎగుమతికి నో చెప్పిన వ్యాక్సిన్ ను 18-44 ఏళ్ల వయసుల వారి వ్యాక్సినేషన్ కోసం రాష్ట్రాలకు అందుబాటులో ఉంచుతామని స్పష్టం చేసింది. తాజాగా ఎగుమతుల్ని ఆపిన 50 లక్షల వ్యాక్సిన్ డోసుల్ని రాష్ట్రాలకే ఇస్తాం.. వీటిని కొనాల్సిందిగా రాష్ట్రాల్ని కోరాం.. ప్రైవేటు ఆసుపత్రులు కూడా తీసుకొవచ్చని కేంద్రంలోని సీనియర్ అధికారి ఒకరు స్పష్టం చేశారు.
మరిప్పుడైనా నిద్ర లేచి రెండు తెలుగు రాష్ట్రాల్లో టోకుగా కొనేలా ప్లాన్ చేస్తే బాగుండు. నిజానికి.. ఈ పాలసీ మొదట్నించే ఉండడటం.. వ్యాక్సిన్ తయారీ కంపెనీలు పెద్ద ఎత్తున ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవటానికి అవసరమైన దన్ను ప్రభుత్వమే ఇచ్చి ఉంటే.. ఈ రోజున ఇన్ని తిప్పలు ఉండేవా? తాజాగా 50 లక్షల టీకాల ఎగుమతి వేళ ప్రదర్శించిన తెలివి ముందే ఉంటే.. ఈ రోజున దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం పరిస్థితి మరోలా ఉండేది. సెకండ్ వేవ్ తీవ్రత ఇంత దారుణంగా అయితే ఉండేది కాదు కదా?