ఆయన టీడీపీ లో సీనియర్ మోస్టు నాయకుడు. ప్రస్తుతం బాబాయ్ అంటూ.. ఆయనను అందరూ ముద్దుగా పిలుచుకుంటారు. ఆయనే రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. దాదాపు 45 సంవత్స రాలుగా ఆయన రాజకీయాల్లో ఉన్నారు. గతంలో టీడీపీలో సంక్షోభం వచ్చినప్పుడు ఎన్టీఆర్ వైపు నిలబడ్డా రు. తర్వాత.. మళ్లీ చంద్రబాబుకు మద్దతు పలికారు. అనేక మందితో ఆయనకు పూర్వానుభవం కూడా ఉంది. అంతేకాదు.. గత 2019లో వైసీపీ గాలి వీచినప్పుడు కూడా తట్టుకుని విజయం దక్కించుకున్నారు.
అయితే..ఇ ప్పుడు మాత్రం గోరంట్లకు టీడీపీలో ఎదరైన గాలిని తట్టుకోవడం కష్టంగా మారిందని అంటున్నా రు. టీడీపీ-జనసేన పొత్తులో భాగంగా.. రాజమండ్రి రూరల్ స్థానాన్ని.. జనసేనకు కేటాయించేందుకు ప్రయత్నాలు ముమ్మురంగా జరుగుతున్నాయని పెద్ద ఎత్తున ప్రచారం ఉంది. దీంతో బుచ్చయ్య తర్జన భర్జన పడుతున్నారు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన వాస్తవానికి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని చెప్పారు.
కానీ, అనూహ్యంగా ఆయన పోటీకి రెడీ అయ్యారు. ఏడోసారి కూడా గెలిచి.. జై కొట్టించుకోవాలనేది ఆయన లక్ష్యం. అయితే.. ఇప్పుడు బుచ్చయ్యకు జనసేనతో పొత్తు వల్ల సీటు దక్కే పరిస్థితి లేకుండా పోతోందని ప్రచారం జరుగుతోంది. బుచ్చయ్య స్థానంలో టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థిగా కందుల దుర్గేష్ పోటీకి రెడీ అయ్యారు. అంతేకాదు.. ఇరు పార్టీల అధినేతల నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
మరోవైపు తానే అభ్యర్థినంటూ దుర్గేష్ కూడా ఇంటింటి ప్రచారం ప్రారంభించారు. అయితే.. తనకు టికెట్ ఇవ్వాల్సిందేనని బుచ్చయ్య పట్టుబడుతున్నారు. కానీ, పార్టీ ఎటూ తేల్చడం లేదు. తాను రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థిగానే పోటీ చేస్తానని గెలిచి తీరుతానని.. చంద్రబాబుకు గిఫ్ట్‌గా ఇస్తానని బుచ్చయ్య చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.