తాంబూలాలిచ్చేశాం.. తన్నుకు చావమన్నట్టు.. ఉంది.. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వ శైలి..! రాష్ట్ర విభజన తర్వాత.. అనేక విషయాలపై ఆంధ్రప్రదేశ్-తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉప్పు-నిప్పుగా ఉన్న పరిస్థితి తెలిసిందే.
నీటి సమస్య, ప్రాజెక్టుల నిర్మాణం, విద్యుత్ బకాయిలు, హైదరాబాద్లోని ప్రభుత్వ కార్యాలయాలు.. ఇలా అనేక సమస్యలు ఉన్నాయి. అయితే.. ఏపీలో రెండు ప్రభుత్వాలు మారినా.. తెలంగాణలో మాత్రం విభజన తర్వాత నుంచి ఒకే ప్రభుత్వం కేసీఆర్ నేతృత్వంలో కొనసాగుతోంది.
అయితే.. ఆయా సమస్యలపై మాత్రం ఇప్పటికీ పరిష్కారం లభించలేదు. విద్యుత్ బకాయిలు.. ఏపీకి తెలంగాణ నుంచి రు. 5 వేల కోట్ల పైచిలుకు రావాల్సి ఉంది. ఇక, సాగునీరు, తాగునీరు, కృష్ణా, గోదావరి జిలాల వినియోగం, వాటాలు.. ప్రాజెక్టులు వంటి అనేక సమస్యలు ఉన్నాయి.
మరీ ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు విషయంపై సుప్రీం కోర్టులో టీఆర్ ఎస్ నేతలు వేసిన కేసు ఇప్పటికీ విచారణ దశలోనే ఉంది. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాలు కూడా కొన్ని సమస్యలను చర్చించుకుని పరిష్కారం చేసుకుంటామని ప్రకటించినా.. ఆదిశగా అడుగులు పడలేదు.
దీంతో ఆయా విషయాలు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం వద్దకు చేరాయి. వీటిలో కీలకమైంది.. నీటి సమస్య, విద్యుత్ బకాయిలు. అయితే, నిన్న మొన్నటి వరకు ఈ సమస్యలపై కేంద్రం దృష్టి పెడుతుందని.. తమకు సానుకూలంగా సమస్యను పరిష్కరిస్తుందని ఇరు రాష్ట్రాలు భావించాయి.
అయితే.. తాజాగా మాత్రం కేంద్రం చేతులు ఎత్తేసింది. టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు తాజాగా జరిగిన పార్లమెంటు సమావేశాల్లో ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న అపరిష్కృత సమస్యలపై కేంద్రాన్ని ప్రశ్నించారు.
కేంద్ర మంత్రి నిత్యానంద్రాయ్ మాట్లాడుతూ.. 14వ ఆర్థిక సంఘం సిఫారసు మేరకు ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదన్నారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీతో పాటు అనేక మినహాయింపులు ఇచ్చామని తెలిపారు. ఇక, అత్యంత కీలకమైన తెలుగు రాష్ట్రాల మధ్య అనేక సమస్యలున్నాయని ఒప్పుకొన్న ఆయన.. పరిష్కారం మాత్రం తమ చేతుల్లో లేదని, తెలుగు రాష్ట్రాలే పరిష్కరించుకోవాలలని ఉచిత సలహా విసిరారు.
అంటే.. దీనిని బట్టి.. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం చోద్యం చూస్తానని చెప్పినట్టే అయింది. సో… రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు.. ఏదైనా సమస్య ఉంటే. నాలుగు గోడలమధ్య కూర్చొని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. లేదా.. రోడ్డునైనా పడాలని .. మోడీ సూటిగా సుత్తి లేకుండా స్పష్టం చేశారన్నమాట!! మరి దీనిని బట్టి మన ముఖ్యమంత్రులు ఏం చేస్తారో ? చూడాలి.