“అయ్యా.. రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లింది. ఇటీవల కురిసిన వాయుగండం వర్షాలతో ఆరు జిల్లాలు ఓ మాదిరిగా దెబ్బతినగా.. మూడు జిల్లాలు నామరూపాలు లేకుండా పోయాయి. సో.. మీరు తప్ప `లావొక్కింత యు లేదు` తక్షణమే వెయ్యి కోట్లిచ్చి ఆదుకోండి.. ఆ తర్వాత కేంద్ర బృందాలను పంపిచండి.. అప్పుడు మరింతగా ఆదుకోండి!“ – అని ఏపీ సీఎం జగన్ కేంద్రానికి లేఖ రాసి.. నాలుగు రోజులు గడిచింది. వాస్త వానికి ఆయన ఈ వరద నష్టంపై లేఖ రాయగానే.. ఇంత ఇవ్వండి! అని కోరగానే కేంద్రం ఇచ్చేస్తుందని.. ఉదారంగా ఆదుకుంటుందని వైసీపీ నేతలు చంకలు గుద్దుకున్నారు.
ఎందుకంటే.. బీజేపీకి-వైసీపీకి మధ్య సాన్నిహిత్యం అండర్ కరెంట్‌గా ప్రవహిస్తున్న నేపథ్యంలో ఆ మాత్రం ఆపన్న హస్తం అందించరా? అని అందరూ అనుకున్నారు. వాయుగుండం కారణంగా ఏర్పడిన ఉత్పాతంతో 4, 450 కోట్ల వరకు నష్టం వాటిల్లిందని పేర్కొన్న జగన్ తక్షణ సాయంగా వెయ్యికోట్లు ఇవ్వాలని కోరారు. దీంతో ఆ మాత్రం ఇవ్వకుండా పోతారా? అని అందరూ అనుకున్నారు. కానీ, ఇప్పటి వరకు కేంద్రం నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. సరే.. ఇదే విషయంపై ఢిల్లీలో ఉన్న వైసీపీ ఎంపీ ఒకరు ఆరాతీశారు. నేరుగా కేంద్ర హోం శాఖ పరిధిలోని విపత్తుల విభాగానికి వెళ్లిన సదరు ఎంపీ.. దీనిపై ప్రశ్నించారు.
“సార్.. ఏపీలో పరిస్థితి భీకరంగా ఉంది. మా సీఎం మీకు లేఖ రాశారు… కొంచెం పరిశీలించండి!“ అని సదరు కృష్ణాజిల్లాకు చెందిన ఎంపీ విజ్ఞప్తిగా అభ్యర్థించారు. దీనికి కేంద్ర హోం శాఖ వర్గాలు ఇచ్చిన సమాధానంతో ఆయన షాకయ్యారట. “మీ సీఎంకేంటి సార్! వేల కోట్ల రూపాయలు పంచేస్తున్నారు. వివిధ పథకాలతో దూసుకుపోతున్నారు. ఆయన ఈ మాత్రం చేయలేరా?“ అని కీలక స్థానంలో ఉన్న ఓ అధికారి నర్మగర్భంగా వ్యాఖ్యానించే సరికి సదరు ఎంపీ విస్మయం చెందారు. ఇక, దీనిని బట్టి కేంద్రం ఏమేరకు సాయం చేస్తుందో అర్ధమైందని అంటున్నారు వైసీపీ నేతలే! మరోవైపు తెలంగాణలో జరిగిన నష్టంపై అక్కడి సీఎం కేసీఆర్ లేఖ రాయగానే కేంద్రం అధికారులను పంపేసింది.
అక్కడ ఏం జరిగిందో అధ్యయనం చేసేందుకు ముందుకు వచ్చింది. కానీ, ఏ పరిస్థితి మాత్రం దీనికి భిన్నంగా ఉంది. దీనికి సీఎం వైఖరే కారణమని, ఏమీ లేకపోయినా.. అప్పులు చేసి మరీ పందేరం చేస్తున్న విధానంపై కేంద్రం కూడా గుర్రుగా ఉందని అంటున్నారు. ఈ పరిణామం.. మున్ముందు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో అని అంటున్నారు. గత ప్రభుత్వం కూడా.. ఆర్థిక వృద్ధి పరుగులు పెడుతోందని ప్రచారం చేసుకుంది. దీంతో కేంద్రం వివిధ పథకాల్లో కోత వేసింది. ఇప్పుడు జగన్ పరిస్థితి కూడా ఇలానే ఉండడం గమనార్హం.