వైఎస్ఆర్సీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలనపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, రాష్ట్ర మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ హెచ్ఐసీసీలో జరిగిన ప్రాపర్టీ షో ప్రారంభోత్సవంలో ఏపీలో పరిస్థితులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంకా చెప్పాలంటే, ఏపీలో పరిపాలన అధ్వానంగా ఉందని మాటలను ఆయన ప్రస్తావించారు. పక్క రాష్ట్రం పరిస్థితులపై తన మిత్రుడు పలు విషయాలను చెప్పారంటూ ఏపీలోని అంశాలను గుర్తు చేశారు. తమ పక్క రాష్ట్రాల్లో లంచాలమయం అయిపోయిందని కేటీఆర్ ఆరోపించారు.
తెలంగాణ ప్రశాంతమైన రాష్ట్రం, దేశంలోనే హైదరాబాద్ బెస్ట్ సిటీ అని కేటీఆర్ తెలియజేశారు. ఏపీలో కరెంట్ లేదు.. నీళ్ళు లేవు.. రోడ్లు ధ్వంసం అయ్యాయి…. అక్కడి పరిస్థితి అధ్వాన్నంగా ఉందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇటీవల ఏపీకి వెళ్లిన తన మిత్రుడు ఊరి నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చాక ఊపిరి పీల్చుకున్నట్లు ఉందని చెప్పాడు అంటూ కేటీఆర్ పేర్కొన్నారు. ఒకసారి ఏపీకి వెళ్లి చూస్తే .. అపుడు తమ విలువేంటో తెలుస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు. బెంగళూరు కంపెనీలు కూడా ఏపీ రోడ్లపై మండిపడుతున్నారు అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. దేశంలో హైదరాబాద్ లాంటి నగరాలు తక్కువని కేటీఆర్ పేర్కొన్నారు.
రూపాయి లంచం లేకుండా అనుమతులు ఇస్తుంది తెలంగాణే ఒక్కటేనని కేటీఆర్ తెలిపారు. పక్క రాష్ట్రాల్లో అధికార పార్టీకి… ప్రతిపక్ష పార్టీకి లంచాలు ఇస్తేనే అనుమతులు ఇస్తున్నారని ఆరోపించారు. ఐదారు నగరాలే దేశాన్ని నడుపుతున్నాయని పేర్కొన్న కేటీఆర్ ఇలాంటి నగరాలను అభివృద్ధి చెందించే విషయంలో కేంద్రం సరైన ప్రోత్సాహం అందించడం లేదని కేటీఆర్ మండిపడ్డారు. కాగా, కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే ఏపీలో అధికార వైసీపీ సోషల్ మీడియాలో మండిపడుతుండటం గమనార్హం.