జగన్ పాలనలో ఏపీ అప్పుల ఊబిలో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. దొరికిన చోటల్లా అప్పులు తేవడం…ఖజానా ఖాళీ చేయడం జగన్ కు ఐదేళ్లపాటు పరిపాటిగా మారిందని విమర్శలు వచ్చాయి. ఐదేళ్ల పాలనలో జగన్ చేసిన ఆర్థిక విధ్వంసం నుంచి రాష్ట్రం ఇంకా కోలుకోలేదు. దీంతో, గాడి తప్పిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మళ్లీ ట్రాక్ లో పెట్టడంతోపాటు పథకాల అమలు వంటి సవాళ్లు కూటమి ప్రభుత్వం ముందున్నాయి. ఈ క్రమంలోనే జగన్ సృష్టించిన ఆర్థిక విధ్వంసాన్ని గణాంకాలతో సహా మంత్రి లోకేశ్ తాజాగా మరోసారి ఎండగట్టారు.
ఆ ఆర్థిక విధ్వంసం అంతా ఇంతా కాదని, అన్ని వ్యవస్థలను జగన్ నిర్వీర్యం చేశారని లోకేశ్ మండిపడ్డారు. దుయ్యబట్టారు. అందినకాడికి అప్పులు చేశారని, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టేశారని విమర్శించారు. 58 ఏళ్ల పాటు ఉమ్మడి ఏపీ, నవ్యాంధ్రను పాలించిన అందరు ముఖ్యమంత్రులు కలిపి చేసిన అప్పుపై 2019 నాటికి రూ.14,155 కోట్ల వడ్డీ చెల్లిస్తున్నామని లోకేశ్ చెప్పారు. కానీ, జగన్ ఐదేళ్ల పాలనలో చేసిన అప్పులపై కట్టాల్సిన వడ్డీ దాదాపు రూ.11 వేల కోట్లు అధికమని తెలిపారు. ప్రస్తుతం మొత్తం వడ్డీ రూ. 24,944 కోట్లకు చేరిందని చెప్పారు. దీనిని బట్టి జగన్ ఎంతటి ఆర్థిక విధ్వంసాన్ని సృష్టించారో ఈ గణాంకాలే చెబుతున్నాయని అన్నారు.
దీంతో, జగన్ పై సోషల్ మీడియాలో నెటిజన్లు ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. అప్పుల్లో అందరు సీఎంలు ఒక పక్క..జగన్ ఒక పక్క అని సెటైర్లు వేస్తున్నారు. ఏపీ చరిత్రలో ఏ ముఖ్యమంత్రికి సాధ్యం కాని..మరే ముఖ్యమంత్రి సాహసం చేయని రీతిలో అప్పులు చేసిన జగన్ చరిత్రలో నిలిచిపోతారని చురకలంటిస్తున్నారు. పొరపాటున ఇంకోసారి జగన్ సీఎం అయితే తన అప్పుల అప్పారావు రికార్డును తానే బ్రేక్ చేయడం ఖాయమని, ఏపీ కూడా శ్రీలంక మాదిరిగా ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లడం తథ్యమని జోస్యం చెబుతున్నారు. జగన్ చేసిన అప్పు, కడుతున్న వడ్డీ నభూతో నభవిష్యతి అని ఎద్దేవా చేస్తున్నారు.