తెలంగాణలో సీఎం కేసీఆర్ కొలువుల జాతరకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఒకేసారి 91 వేల ఉద్యోగాల భర్తీకి గులాబీ బాస్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నిరుద్యోగులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. జంటనగరాలలోని కోచింగ్ సెంటర్లు నిరుద్యోగలతో కిటకిటలాడుతున్నాయి. రాబోయే ఆర్నెలలు ఎంతో కీలకం కావడంతో నిరుద్యోగులంతా ప్రిపేర్ కావడంపై ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలోనే నిరుద్యోగ యువతతో పాటు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారందరికీ మంత్రి కేటీఆర్ కీలకమైన సలహాలు, సూచనలు ఇచ్చారు.
రాబోయే 6 నెలలపాటు సినిమాలు, సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని కేటీఆర్ సలహా ఇచ్చారు. అంతేకాదు, క్రికెట్ తక్కువగా చూడాలని, ఫోన్లో వాట్సాప్, ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లను బంద్ చేసి ప్రిపరేషన్ పై ఫోకస్ పెట్టాలని సూచించారు. కని, పెంచి కష్టపడి పెద్దవాళ్లను చేసిన తల్లిదండ్రులను సంతోషపెట్టేలా మంచి భవిష్యత్తుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని హితవు పలికారు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత కోచింగ్ సదుపాయాన్ని అభ్యర్థులంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఒక ఉద్యోగానికి వంద మంది పోటీ పడుతున్నారని, కానీ, పట్టుదలతో చదివి ఉన్నత ఉద్యోగాలు పొందాలని అన్నారు. తీవ్రంగా ప్రయత్నించినా ఉద్యోగం రాకుంటే నిరాశ పడొద్దని, ప్రత్యామ్నాయ ఉద్యోగావకాశాలు అనేకమున్నాయని ధైర్యం చెప్పారు. ఉద్యోగమంటే ప్రభుత్వ ఉద్యోగం ఒక్కటే కాదని, ప్రభుత్వరంగంలో సుమారు 5 లక్షల వరకు ఉద్యోగాలు మాత్రమే ఉంటాయని, టీఎస్ఐపాస్ ద్వారా లక్షల సంఖ్యలో ప్రైవేట్ ఉద్యోగాలను సృష్టిస్తున్నామన్నారు.
జర్మనీ తరహాలో ఓ పక్క చదువుకొంటూనే పరిశ్రమల్లో విధులు నిర్వహించేలా కోర్సులను రూపొందించే యోచనలో ఉన్నామన్నారు. స్వయం ఉపాధి కింద యువతకు రుణాలివ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నామని, ప్రపంచంలో మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా నైపుణ్యాన్ని తీర్చిదిద్దుకోవాలని పేర్కొన్నారు. కేంద్రం త్వరలో ప్రకటించబోతోన్న ఉద్యోగాల ఖాళీలలో తెలంగాణ భాగం దాదాపు 70 వేల వరకు ఉంటుందని, ఉద్యోగార్థులు ఇప్పుడు శిక్షణ పొందితే.. కేంద్ర ప్రభుత్వోద్యోగాలు పొందడానికి కూడా ఉపయోగపడుతుందని సూచించారు.