తన హయాంలో జగన్ ఏపీలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. అధికార పార్టీ నేతలకో నీతి, విపక్ష నేతలకో నీతి అన్న చందంగా తయారైంది జగన్ పాలన. టీడీపీ నేతలపై, టీడీపీ అధినేత చంద్రబాబుపై జగన్ సహా మంత్రి కొడాలి నాని, ఇతర ఎమ్మెల్యేలు తీవ్ర పదజాలంతో దూషణలకు దిగుతున్న వైనం యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుసు. ఇక పవిత్రమైన అసెంబ్లీలో సైతం చంద్రబాబు అనుభవాన్ని,వయసును కూడా మరచిపోయి వైసీపీ ఎమ్మెల్యేలు చేసిన హంగామా తాలూకు వీడియోలు వారి ప్రవర్తనకు నిలువెత్తు సాక్ష్యాలు.
తమ అధినేతపై అధికార పార్టీ నేతలు గుప్పిస్తున్న అసత్య ఆరోపణలు, పసలేని విమర్శలను తిప్పికొట్టేందుకు టీడీపీ నేతలు కూడా సభా మర్యాదను పాటిస్తూనే విమర్శించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా జరిగిన అసెంబ్లీ ప్రివిలైజ్ కమిటీ సమావేశంలో టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడులపై సంచలన నిర్ణయం తీసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జగన్ ను వ్యక్తిగతంగా దూషించారన్న సాకుతో టీడీపీ శాసనసభాపక్ష ఉపనేతలు అచ్చెన్నాయుడు, రామానాయుడులపై చర్యలు తీసుకున్నారు.
ఈ అసెంబ్లీ సమావేశాలు జరిగినన్ని రోజులూ.. వారిద్దరికీ మైక్ ఇవ్వకూడదని ప్రివిలేజ్ కమిటీ నిర్ణయించింది. అయితే, ఈ ప్రతిపాదనలను ప్రివిలైజ్ కమిటీ సభ్యుడు అనగాని సత్యప్రసాద్ వ్యతిరేకించారు. రామానాయుడిని సీఎం జగన్.. డ్రామా నాయుడు అన్నారని, దానికి బదులుగా రామానాయుడు వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. కావాలంటే రికార్డులను పరిశీలించుకోవాలని కూడా సత్యప్రసాద్ సూచించారు.
అచ్చెన్నాయుడు, రామానాయుడికి అసెంబ్లీ సమావేశాల్లో మైక్ ఇవ్వకూడదనే తీర్మాణాన్ని ప్రివిలైజ్ కమిటీ.. స్పీకర్‌కు పంపనుంది. అదేవిధంగా నిమ్మగడ్డ రమేష్‌కుమార్ లేఖను కమిటీ పరిశీలించింది. అలాగే కూన రవికుమార్ లేఖను కూడా పరిశీలించింది. ఏది ఏమైనా అధికార పార్టీ నేతలకు ఒక న్యాయం, విపక్ష నేతలకు ఒక న్యాయం అంటూ విమర్శలు వస్తున్నాయి. అసెంబ్లీలో తనను ప్రశ్నించే ఆ ఇద్దరి గొంతు నొక్కాలన్న ఉద్దేశ్యంతోనే జగన్ ఇలా చేశారని అంటున్నారు.