ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో సీమ అల్లాడిపోయిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా కడప, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో వరద బీభత్సం సృష్టించింది. వేల కోట్ల రూపాయల ఆస్తి, పంట నష్టం జరగడంతో పలువురు సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు భారీగా విరాళాలిస్తున్నారు. మరికొందరైతే, తమ ట్రస్టుల ద్వారా వరదబాధితులకు అవసరమైన సామాగ్రిని, ఆహారాన్ని అందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ ట్రస్టు తరఫున నారా భువనేశ్వరి విశేషంగా సర్వీస్ చేసింది.
కానీ, సీఎం జగన్ సొంత జిల్లా వైఎస్సార్ కడపలో వరదబాధితుల కోసం సీఎం సతీమణి, వ్యాపారవేత్త అయిన వైఎస్ భారతి మాత్రం సైలెంట్ గా ఉన్నారు. తన తండ్రి, మామ, భర్త సొంత జిల్లా అయిన కడపలో ప్రజలకు మాత్రం భారతి ఆపన్న హస్తం అందించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. తన భర్త జగన్ కు మొత్తం సీట్లు గెలిపించి సీఎంను చేసిన జిల్లాపై భారతి చిన్నచూపుపై పలువురు పెదవి విరుస్తున్నారు.
ఇంకా చెప్పాలంటే ఆదాయంలో భువనేశ్వరితో పోలిస్తే భారతికి ఉన్నవి చాలా పెద్ద కంపెనీలు. వాటి ఆదాయం కూడా చాలా ఎక్కువ. అందులోనూ వైసీపీకి పెట్టని కోట వంటి కడపలో జనం ఇక్కట్లు పడుతుంటే భారతి స్పందించకపోవడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ భారతికి అలాంటివి పట్టవా అంటూ సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు.