నియోజకవర్గాల పునర్విభజన కోసం ఏపీ, తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రం అనుమతించి అన్నీ అనుకున్నట్టుగా జరిగితే ఏపీలో ప్రస్తుతం ఉన్న 175 అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య 225కు, తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 119 అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య 153కు పెరుగుతుందని ఇరు తెలుగు రాష్ట్రాల రాజకీయ ఆశావహులంతా ఆతృతగా వెయిట్ చేస్తున్నారు.
“ఏపీ పునర్విభజన చట్టం” ప్రకారం కూడా నియోజకవర్గాల పెంపు జరగాల్సి ఉంది. తెలంగాణ ఏర్పడి ఎనిమిదేళ్లు అవుతున్నా రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలను ఇంత వరకు పెంచలేదు. అదే జరిగితే ఆపరేషన్ ఆకర్ష్ తో పక్క పార్టీల నేతలకు గేలం వేసి కండువాలు కప్పిన జగన్, కేసీఆర్ లు…వారికి న్యాయం చేయవచ్చని భావించారు. అయితే, నియోజకవర్గాల పునర్విభజన అంశాన్ని కేంద్రం ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వస్తోంది.
ఈ క్రమంలోనే తాజాగా జగన్, కేసీఆర్ ల ఆశలపై కేంద్రం నీళ్లు చల్లింది. ఇరు తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ఇప్పట్లో లేదని కేంద్ర ప్రభుత్వం తాజాగా తేల్చేసింది. ఏపీ, తెలంగాణలో 2026 తర్వాతే నియోజకవర్గాలను పునర్విభజిస్తామని రాజ్యసభలో పక్కాగా క్లారిటీనిచ్చింది. అసెంబ్లీ నియోజకవర్గాలను పెంచాలంటే రాజ్యాంగ సవరణ అవసరమని తెలిపింది.
విభజన చట్టంలోని సెక్షన్ 15కు లోబడి ఏపీలో 225, తెలంగాణలో 153 అసెంబ్లీ స్థానాలకు పెంచుకోవచ్చని స్పష్టతనిచ్చింది. బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద సహాయ మంత్రి నిత్యానందరాయ్ ఈ ప్రకారం లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 ప్రకారం 2026 తర్వాత ప్రచురించే జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని కేంద్రం చెబుతోంది. గత ఏడాది కూడా లోక్ సభలో కేంద్రమే 2031 వరకు పెంపు లేదని స్పష్టం చేసింది. తాజా ప్రకటనతో జగన్, కేసీఆర్ ల ఆశలపై ప్రధాని మోదీ నీళ్లు చల్లినట్లయింది.