ఏపీలో దేవతామూర్తుల విగ్రహాల ధ్వంసం మీద జరుగుతున్న వివాదం అంతకంతకూ పెరుగుతోంది. దీనికి తోడు.. ఒకటి తర్వాత మరొకటి అన్నట్లుగా వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాలు షాకింగ్ గా మారుతున్నాయి. ఆదివారం ఉదయం విజయవాడ బస్టాండ్ కు సమీపంలోని గుడిలో సీతమ్మ వారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన పెను సంచలనంగా మారింది. ఒక దశలో.. విగ్రహం జారి పడిందేమో? ఎలుకల కారణంగా కిందకు పడిందేమో? అన్న సందేహాలు వ్యక్తమైతే.. వీటిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది.
సీతమ్మ విగ్రహ ధ్వంసం మీద విజయవాడ పోలీసులు సీరియస్ గా ఉన్నారట. దీనిపై తాజాగా విజయవాడ సీపీ బత్తిని శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు. వివిధ కోణాల్లో దర్యాప్తు చేసిన అనంతరం.. తాము గుర్తించిన వివరాల్ని ఆయన వెల్లడించారు.
ఆదివారం ఉదయం ఐదున్నర గంటల వరకు సీతమ్మ విగ్రహం బాగానే ఉందన్న విషయాన్ని చెప్పారు. అదెలా అంటే.. ఆ సమయం వరకు అక్కడి ఆటో డ్రైవరర్లు అమ్మవారికి దండం పెట్టుకొని వెళ్లారని.. అప్పటికి ఏం జరగలేదన్నారు.
అంటే.. ఉదయం ఐదున్నర గంటల వరకు విగ్రహాలు బాగున్నట్లైతే.. ఆ తర్వాత అంటే తెల్లవారిన తర్వాతే సీతమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేశారా? లేదంటే.. పోలీసులు మొదట్నించి అనుమానించినట్లుగా అనుకోని రీతిలో విగ్రహాలు కింద పడ్డాయా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఉదయం ఐదున్నర గంటల నుంచి ఉన్న సీసీ కెమేరాల ఫుటేజ్ లను తాము పరిశీలిస్తున్నామని.. త్వరలోనే ఏం జరిగిందన్న విషయంపై స్పష్టత వస్తుందన్నారు.
ఆలయాల వద్ద ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీపీ కోరారు. మొత్తానికి.. సీతమ్మ వారి విగ్రహ ధ్వంసం వెనుక ఏం జరిగిందన్నది మాత్రం ఘటన జరిగిన పద్నాలుగు.. పదిహేను గంటలు దాటిన తర్వాత కూడా తేలకపోవటాన్ని పలువురు అసంతృప్తి వ్యక్తి చేస్తున్నారు.
సీసీ కెమెరాలు పరిశీలించడానికి ఇన్ని గంటల సమయం ఎందుకు తీసుకుంటున్నారు? కేవలం గంట లేదా రెండు గంటల సేపు చూస్తే సరిపోతుంది. కానీ ఇన్ని గంటల పాటు సీసీ ఫుటేజీ డిటెయిల్స్ బయట పెట్టకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది.