మే 20న టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ 38వ బర్త్ డే జరుపుకోబోతోన్న సంగతి తెలిసిందే. యంగ్ టైగర్ బర్త్ డేను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసేందుకు ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు. ఇప్పటికే ట్విటర్లో #HappyBirthdayNTR ట్రెండింగ్ లో ఉంది. మరోవైపు, రేపు భారీ స్థాయిలో ఎన్టీఆర్ కటౌట్లకు పాలాభిషేకాలు, భారీ కేక్ కంటింగ్ లు, అన్నదానాలు వంటి కార్యక్రమాలు చేేసేందుకు ఫ్యాన్స్ సన్నాహాలు చేసుకుంటున్నారు. తమ అభిమాన హీరో పుట్టినరోజును ఘనంగా జరుపుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నారు.
అయితే, కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో తన బర్త్ డే సెలబ్రేట్ చేయవద్దంటూ జూనియర్ ఎన్టీఆర్ పిలుపునిచ్చారు.
ప్రస్తుతం ఉన్న విపత్కర పరిస్థితుల్లో అభిమానులెవరూ సభలు, పబ్లిక్ మీట్ లు, వేడుకలు నిర్వహింవద్దని రిక్వెస్ట్ చేశారు. తన ఫ్యాన్స్ ని ఉద్దేశించిన తారక్ సోషల్ మీడియా ద్వారా ఓ లెటర్ ను రిలీజ్ చేశారు. ఇటీవల కరోనా బారిన పడిన తారక్ హోమ్ ఐసోలేషన్ లో చికిత్స పొందుతోన్న సంగతి తెలిసిందే.
తన అభిమానులందరికీ తారక్ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. అభిమానుల ఆశీస్సులతో తాను కోలుకుంటున్నానని, ప్రస్తుతం తాను బాగున్నానని, త్వరలో పూర్తిగా కోలుకొని కోవిడ్‌ను జయిస్తానని ఆశిస్తున్నానని తారక్ చెప్పారు. ఈ ఏడాది కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఇంటి పట్టునే ఉండి కర్ఫ్యూ, లేదా లాక్డౌన్ నియమాలను పాటించడమే తన పుట్టినరోజునాడు ఇచ్చే అతి పెద్ద కానుక అని ఫ్యాన్స్ కు తారక్ సందేశమిచ్చారు. త్వరలో మనదేశం కరోనాను జయిస్తుందని, ఆ రోజున అందరం కలిసి వేడుక చేసుకుందామని, అప్పటి వరకు మాస్క్ ధరించి జాగ్రత్తగా ఉండాలని పిలుపునిచ్చారు.