2024 సార్వత్రిక ఎన్నికలు మరికొద్ది నెలల్లో జరగనున్న నేపథ్యంలో ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. వైసీపీ మినహా మిగతా పార్టీలు పొత్తులపై ఒక క్లారిటీ ఇవ్వకపోవడంతో ఏ పార్టీల మధ్య పొత్తు ఉంటుంది అన్న డైలమా ప్రజల్లో ఏర్పడింది. టీడీపీ, జనసేన కచ్చితంగా కలిసి పోటీ చేస్తాయని ప్రచారం జరుగుతున్నప్పటికీ జనసేన…బీజేపీతో ఉందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీలో బీజేపీ, టీడీపీల మధ్య పొత్తుపై ఆ పార్టీకి సంబంధించిన కీలక నేతలు సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాబోయే ఎన్నికలలో టీడీపీతో పొత్తు పెట్టుకునేందుకు బీజేపీ సంసిద్ధంగా లేదని ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్ చార్జి సునీల్ దేవధర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2014లో బీజేపీ, టీడీపీల మధ్య పొత్తు ఉండేదని, ఆ తర్వాత చంద్రబాబు ఎన్డీఏ నుంచి బయటికు వెళ్లారని గుర్తు చేశారు. ఏపీ బీజేపీ చీఫ్ గా పురందేశ్వరిని నియమించామని, రాబోయే ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని చెప్పారు. టీడీపీతో పొత్తుపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు కూడా షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఏపీలో టీడీపీపై విశ్వసనీయత లేదని, అందుకే ఆ పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశాలు లేవని జీవీఎల్ చెప్పారు. రాష్ట్రంలో వైసీపీ పాలన అధ్వానంగా తయారైందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలిగా పురంధేశ్వరిని నియమించడం వెనుక ఎంత దూరదృష్టి ఉందని, భవిష్యత్తులో ఏపీలో బీజేపీ కీలక పాత్ర పోషించడం ఖాయమని అన్నారు.
మరోవైపు, రాష్ట్రంలో బీజేపీ, టీడీపీ, జనసేనలు రాబోయే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాయని బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. బిజెపి కేంద్ర నాయకత్వం కూడా ఈ రకంగానే సంకేతాలు ఇచ్చిందని, లేదంటే సొంతగా తాను ఈ వ్యాఖ్యలు ఎందుకు చేస్తానని ఆయన ప్రశ్నించారు. సీబీఐ కేసుల నుంచి జగన్ ను బిజెపి కాపాడుతుంది అన్న ఆరోపణల్లో వాస్తవం లేదని, జగన్ కు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం అందడం లేదని ఆయన అన్నారు.