ముఖ్యమంత్రి జగన్ చెబితే వినడు, తనంతకు తనకు చేతకాదు వెరసి పేదలను రైతులను ముంచుతున్నాడు అని ప్రతిపక్షనేత చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వరద నష్టం నుంచి తప్పించుకోవడానికి ఎంతో టెక్నాలజీ అందుబాటులో ఉంది. మా హయాంలో దాన్ని ఏర్పాటుచేశాం. కానీ దానిని వాడటం చేతకాక రైతులను, వారి పంటలను జగన్ నీళ్ల పాలు చేస్తున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు.
ప్రభుత్వం యొక్క అవగాహన లేమి, నిర్లక్ష్యం వల్ల ఏపీ రైతులు తమ పంటలను పూర్తిగా నష్టపోతున్నారని, చేతికొచ్చిన పంటలను వరద పాలు చేసుకుంటున్నారని ప్రతిపక్ష నేత చంద్రబాబు ధ్వజమెత్తారు. కరవు వస్తే దానికి మనం చేసేదేమీ లేదు. కానీ వరద వస్తే కాపాడుకోవడం మన చేతుల్లోనే ఉంది… అది చేతకాని ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మందిరైతుల జీవితాలను బుగ్గిపాలు చేస్తోందని చంద్రబాబు ఆరోపించారు.
వరద రావడానికి వారం ముందే ఎక్కడ వరద వస్తోంది. ఎంత వరద వస్తోంది అని తెలుసుకునే అవకాశం ఉంది. దానిని వాడుకుని రైతులను అప్రమత్తం చేస్తే 70 శాతం పంటను వరద నుంచి కాపాడుకుంటారు. కానీ ప్రభుత్వం నడిపేవారికి అవగాహన లేమి, అజ్జానం వల్ల దానిని వాడటం లేదు. దీంతో వరద ఎపుడు వస్తుందో రైతులకు తెలియడం లేదు. ఇది వారిని తీవ్రంగా నష్టాల పాలు చేస్తోందని చంద్రబాబు ఆవేదన వ్యక్తంచేశారు.
సముద్రాన్ని కంట్రోల్ చేస్తా అని చంద్రబాబును ట్రోల్ చేసే వైసీపీ సోషల్ మీడియా ఇపుడు రైతులకు ఏం సమాధానం చెబుతుందో మరి. తుపాన్లు వరదలు టెక్నాలజీ ద్వారా ముందే పసిగట్టి ఎక్కడెక్కడ వస్తుందో తెలుసుకుని ఆ సమాచారం అధికారుల ద్వారా రైతులకు, లోతట్టు ప్రాంతాలకు చేరవేసి గత ప్రభుత్వం కాపాడేది. ఇపుడు ఆ సమాచారం చెప్పే వారే లేరు. దీంతో రైతులు, లోతట్టు ప్రాంతాల ప్రజలు ఘోరంగా నష్టపోతున్నారు.
ఈ ఏడాది ఇది వరుసగా నాలుగో విపత్తు. మళ్లీ మరో 3 రోజుల్లో కొత్త విపత్తు ఉందంటున్నారు. రైతులు భయాందోళనలో ఉన్నారు. ప్రభుత్వం చోద్యం చూస్తోంది. నివార్ తుఫానుతో 10 జిల్లాల్లో 5 లక్షల ఎకరాల పంటను రైతులు నష్టపోయారు. ఉద్యాన పంటలు కూడా దెబ్బతిన్నాయి. ఈ ఖరీఫ్ లో ఒక్కటే 20 లక్షల ఎకరాల పంట నష్టపోయారు రైతులు. ఇదంతా ప్రభుత్వ అసమర్థతే అని చంద్రబాబు ఆరోపించారు.
కనీసం రబీలో అయినా రైతులకు పెట్టుబడి సాయం అందించి వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.