కరోనా మహమ్మారి సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరినీ ఇళ్లకే పరిమితం చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో చాలామంది ప్రజలు ఇల్లు వదిలి బయటకు అడుగుపెట్టేందుకే భయపడ్డారంటే అతిశయోక్తి కాదు. ఈ క్రమంలోనే ప్రజలు గడపదాటకుండా ఉండేందుకు చాలామంది సెలబ్రిటీలు కుకింగ్ ఛాలెంజ్, క్లీనింగ్ ఛాలెంజ్, గ్రీన్ ఛాలెంజ్ అంటూ రకరకాల ఛాలెంజ్ లు విసిరారు.
ఇక, మరికొంతమంది సెలబ్రిటీలు తమ యూట్యూబ్ చానెళ్లలో వీడియోలు పోస్ట్ చేసి పదో పరకో సంపాదించుకున్నారు. అలా సంపాదించుకున్న వారిలో తాను కూడా ఉన్నానంటూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తాజాగా వెల్లడించారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో తన ఆదాయం పెరిగిందని గడ్కరీ చెప్పారు. కరోనాకాలంలో ఇంటి దగ్గరే ఉన్నానని, ఆ ఖాళీ సమయంలో తాను యూట్యూబ్‌లో అనేక వీడియోలు పోస్ట్ చేశానని అన్నారు.
తాను పోస్ట్ చేసిన లెక్చర్ వీడియోలకు మంచి వ్యూవర్షిప్ వచ్చిందని గడ్కరీ అన్నారు. గతంతో పోలిస్తే కరోనా కాలంలో తన చానెల్ కు వీక్షకులు, సబ్ స్క్రైబర్లు పెరిగారని, దీంతో, తనకు రాయల్టీ రూపంలో నెలకు దాదాపు రూ.4 లక్షలు వస్తోందని వెల్లడించారు. అంతేకాదు, లాక్ డౌన్ లో తాను చెఫ్‌గా మారి ఇంట్లో గరిట పట్టి వంట కూడా చేశానని అన్నారు. వర్చువల్ ఉపన్యాసాలు, 50కి పైగా లెక్చర్లు యూట్యూబ్‌లో అప్లోడ్ చేశానని తెలపారు.
వాటికి వ్యూవర్షిప్ పెరిగిందని అన్నారు. మన దేశంలో మంచి పనులు చేసేవారికి ప్రశంసలు రావన్నారు. ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వే (డీఎంఈ) పురోగతిపై సమీక్షించిన సందర్భంగా గడ్కరీ ఈ వివరాలు వెల్లడించారు. రోడ్ కన్స్ట్రక్షన్ కాంట్రాక్టర్స్, కన్సల్టెంట్లకురోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ రేటింగ్ ఇవ్వడం ప్రారంభించిందని చెప్పారు.