ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయంలో ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు మధ్య హైడ్రామా నడిచిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టుకు వెళ్లి మరీ తన పదవినీ, పంచాయతీ ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ని తెచ్చుకున్న నిమ్మగడ్డ…ఎన్నికల నిర్వహణ సమయంలోనూ తన దూకుడును కొనసాగించారు. తనపై నోటికొచ్చినట్టు మాట్లాడిన మంత్రులను సైతం కోర్టుకు లాగిన నిమ్మగడ్డ….ఓటర్లను ప్రలోభపెడతారన్న అనుమానంతో వలంటీర్ల సేవలను రద్దు చేశారు.
ఈ క్రమంలోనే తాజాగా మున్సిపల్ ఎన్నికల లోనూ వలంటీర్ల సేవలు వద్దంటూ నిమ్మగడ్డ మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీంతోపాటు, బెదిరింపులు, బలవంతపు చర్యలతో పోటీ నుంచి తప్పుకున్న అభ్యర్థులకు మరో ఛాన్స్ ఇవ్వాలనే యోచనలో నిమ్మగడ్డ ఉన్నట్టు తెలుస్తోంది. బాధితుల అభ్యర్థనలను పరిశీలించి ఒకటి,రెండు రోజుల్లో ఆ విషయంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈసీకి ఉన్న స్పెషల్ పవర్స్ తో అటువంటి వారిపై సానుభూతితో వ్యవహరించి బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద మరోసారి అవకాశం కల్పించే ఆలోచనలో ఉన్నామని నిమ్మగడ్డ తెలిపారు.
బలవంతపు విత్ డ్రాలు, దౌర్జన్యాల కారణంగా నామినేషన్లు వేయలేని వారి వివరాలను ఎస్ఈసీకి కలెక్టర్లు నివేదికగా చేసి పంపారు. మరికొన్ని జిల్లాల నుంచి కూడా పూర్తి వివరాలు తెప్పించుకున్న ఎస్ఈసీ….రెండ్రోజుల్లో ఈ వ్యవహారంపై తుది ఉత్తర్వులు జారీ చేయనుంది. మరోవైపు ఎన్నికలు పూర్తయ్యే వరకు గ్రామ, వార్డు వాలంటీర్ల వ్యవస్థను తాత్కాలికంగా నిషేధిస్తున్నామని నిమ్మగడ్డ ప్రకటించడం అధికార పార్టీకి మింగుడు పడడం లేదు.
మున్సిపల్ ఎన్నికల ప్రక్రియకు వార్డు వాలంటీర్లను పూర్తిగా దూరంగా ఉంచుతున్నామని ఎస్ఈసీ తెలిపింది. వాళ్లు ఏదైనా పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తే క్రిమినల్ నేరాలకు పాల్పడ్డట్లుగా అభియోగాలు మోపుతామని వార్నింగ్ ఇచ్చింది. పార్టీల గుర్తులపై జరిగే ఈ ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగులు తటస్థంగా వ్యవహరించాలని తెలిపింది. వాలంటీర్లు కూడా ఇందుకు మినహాయింపు కాదని తెలిపింది. ఎన్నికల ప్రచారానికి కేవలం 5గురికే పర్మిషన్ ఇస్తామని వెల్లడించింది. కరోనా నిబంధనలు అందరూ పాటించాల్సిందేనని తెలిపింది.