స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అంశం ఏపీలో ఎంత చర్చనీయాంశం అయ్యిందో అందరికీ తెలిసిందే. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఏ విషయాన్ని తప్పు అన్నాడో, ఏ విషయం గురించి నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై కమ్మకుల ముద్ర వేయించాడో అదే విషయాన్ని జగన్ నోటితోనే చెప్పించిన ఘనత నిమ్మగడ్డ రమేష్ కుమార్ ది.
ప్రభుత్వానికి సమాచారం ఇవ్వలేదు అన్న ఒక విమర్శ తప్ప… నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆ రోజు తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కూడా తప్పు పట్టలేదు. అయితే, కరోనా సర్దుకున్నాక దేశమంతటా ఎన్నికల హడావుడి జోరుగా ఉన్న నేపథ్యంలో ఇపుడు ఎన్నికలు పెడదాం అంటే ప్రభుత్వం వద్దంటోంది. నిజానికి ప్రభుత్వానికి ఆ హక్కు లేదు. కానీ అధికారులను నియంత్రించడం ద్వారా ప్రభుత్వం ఎన్నికలను అడ్డుకుంటోంది.
దీనిని చట్టబద్ధంగా ఎదుర్కోవడానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ న్యాయపోరాటం చేశారు. అందులో భాగంగా సీఎస్ కి లేఖ రాస్తే ఆమె పట్టించుకోలేదు. తర్వాత రెండోసారి లేఖ రాసినా నిర్లక్ష్యం చేశారు. దీంతో తాజాగా మూడోసారి కూడా లేఖ రాస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు నిమ్మగడ్డ రమేష్ కుమార్. ఈసారి ప్రభుత్వం తనకు సహకరించాలని ఇచ్చిన ఆదేశాలను ఆ లేఖకు జతచేశారు నిమ్మగడ్డ రమేష్ కుమార్. దీంతో ఈ వ్యవహారం రసవత్తరంగా మారింది.
ఇపుడు సీఎస్ నీలం సాహ్నికి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా ఉంది. అటు సీఎం జగన్, ఇటు కోర్టు… దేనికి ఎదురు తిరిగినా క్లిష్టమే. మరి ఎలాంటి సమాధానం వస్తుందో వేచిచూడాలి. ఎన్నికల నిర్వహణకు కరోనా తీవ్రత కారణంగా చూపుతోంది జగన్ సర్కారు. కానీ అది కోర్టులో నిలబడదు. ఎందుకంటే దేశ వ్యాప్తంగా కరోనాలోనే అనేక ఎన్నికలు జరిగాయి.