తప్పనిసరి పరిస్థితుల్లో ఏపీలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధమైన ఏపీ సర్కార్….ఆ తాలూకు అసహనాన్ని రకరకాల రూపాల్లో వ్యక్తపరుస్తున్న సంగతి తెలిసిందే. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను టార్గెట్ చేసిన వైసీపీ నేతలు….ఆయనపై విమర్శలకు దిగడమే కాకుండా ఎన్నికల విధులు నిర్వహిస్తున్న అధికారులను భయభ్రాంతులకు గురి చేసేలా బెదిరింపు ప్రకటనలు చేయడంపై విమర్శలు వస్తున్నాయి. నిమ్మగడ్డ మాటలు విని ఏకపక్షంగా వ్యవహరించే అధికారులను తమ ప్రభుత్వం ఉన్నన్ని రోజులూ బ్లాక్ లిస్ట్‌లో పెడతామంటూ మంత్రి పెద్దారెడ్డి మీడియా సాక్షిగా వార్నింగ్ ఇచ్చిరు. ఏకగ్రీవమైన అభ్యర్థులకు డిక్లరేషన్ ఇవ్వని అధికారుల పేర్లు తీసుకుని.. మార్చి 31 తర్వాత గుణపాఠం నేర్పుతామంటూ హెచ్చరించిన వైనంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పెద్దిరెడ్డికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ షాకిచ్చారు.
ఈ నెల 21వ తేదీ వరకు పెద్దిరెడ్డిని ఇంటికే పరిమితం చేయాలని, మీడియాతో మాట్లాడనివ్వొద్దని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ప్రజలు నిర్భయంగా ఓటేసేందుకు, ఎన్నికలు నిజాయితీగా, నిష్పక్షపాతంగా జరిగేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నామని ఎస్ఈసీ వెల్లడించింది. మరోవైపు, మంత్రి పెద్దిరెడ్డిపై టీడీపీ నేతలు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కు ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించారు. అయితే, గవర్నర్ అందుబాటులో లేకపోవడంతో గవర్నర్ సెక్రటరీకి పెద్దిరెడ్డిపై ఉమ, వర్ల రామయ్య, బుద్దా వెంకన్న, అశోక్ బాబు, మరెడ్డి శ్రీనివాసరెడ్డి, గద్దె రామ్మోహన్ తదితరుల బృందం ఫిర్యాదు చేసింది. ఉద్యోగస్తులనుద్దేశించి మంత్రి పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై గవర్నర్ సెక్రటరీకి టీడీపీ బృందం ఫిర్యాదు చేసింది. మంత్రి పెద్దిరెడ్డిని వెంటనే కేబినెట్ నుంచి తొలగించాలని టీడీపీ నేతలు ఫిర్యాదులో పేర్కొన్నారు. మరి, పెద్దిరెడ్డిపై డీజీపీ, గవర్నర్ ఏవిధమైన చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.