ముగ్గురు పిల్లలున్నా ఓకే...వైసీపీకి స్పెషల్ ఎలక్షన్ రూల్స్

ఏపీలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలలో గెలుపు కోసం అధికార పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. బలవంతపు ఏకగ్రీవాలకు వైసీపీ పాల్పడుతోందంటూ ఫిర్యాదులు రావడంతో....గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో ఏకగ్రీవాలను వెల్లడించవద్దంటూ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశించిన విషయం విదితమే. ఓ వైపు రాష్ట్ర ఎన్నికల సంఘం చెప్పినట్టు రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలని అధికారులుప్రయత్నిస్తున్నారు. అయితే, మరోవైపు, ఎస్ఈసీ చెప్పినట్టల్లా చేస్తే చర్యలు తప్పవంటూ మంత్రి పెద్దిరెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలోనే కొన్ని చోట్ల అధికారులు వైసీపీ బలపరిచిన అభ్యర్థులకో న్యాయం....టీడీపీ బలపరిచిన అభ్యర్థులకో న్యాయం అన్న రీతిలో వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. తాజాగా పశ్చిమగోదావరి జిల్లాలో వైసీపీ బలపరిచిన అభ్యర్థి కోసం ముగ్గురు పిల్లల నిబంధనకు అధికారులు కొత్త భాష్యం చెప్పారు. ఇదేమిటని ప్రశ్నిస్తే...వింత వితండవాదనను వినిపిస్తున్న వైనం సర్వత్రా చర్చనీయాంశమైంది.

పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి మండలం స్కిన్నెరపురంలో వైసీపీ మద్దతుతో అడ్డాల భాను లలిత మహాలక్ష్మి, టీడీపీ మద్దతుతో కునుపూడి నాగదుర్గ సర్పంచ్ పదవికి నామినేషన్లు వేశారు. ఈ ఇద్దరు అభ్యర్థులకు ముగ్గురు పిల్లలున్నారు. అదీకాకుండా, ఇద్దరికీ ఒక విడత కాన్పులో కవల పిల్లలు, మరో విడత కాన్పులో ఒక శిశువు జన్మించారు. అయితే, మహాలక్ష్మి నామినేషన్‌ను అనుమతించిన అధికారులు....నాగదుర్గ నామినేషన్‌ తిరస్కరించారు. ఇదేమిటని ప్రశ్నించిన మహాలక్ష్మికి అధికారులు చెప్పిన సమాధానం విని మైండ్ బ్లాక్ అయింది. వైసీపీ బలపరిచిన అభ్యర్థి మహాలక్ష్మికి ముందు ఇద్దరు కవల పిల్లలు, తర్వాత ఒక శిశువు జన్మించడంతో నామినేషన్ అనుమతించామని, నాగదుర్గకు ముందు ఒక శిశువు...తర్వాత ఇద్దరు కవల పిల్లలు జన్మించడంతో నామినేషన్ తిరస్కరించామని అధికారులు కొత్త భాష్యం చెప్పారు. అధికారుల చెప్పిన కొత్త నిబంధన...కొత్త భాష్యానికి అవాక్కయిన నాగదుర్గ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం చేయాలని కోరారు. మరి, నాగదుర్గ ఫిర్యాదుపై ఎస్ఈసీ ఏ విధంగా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

వాస్తవానికి నిబంధనల ప్రకారమైతే ముగ్గురు పిల్లలుంటే స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేసేందుకు అనర్హులు. కానీ, అయితే 1994 ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ చట్టం అమలు తేదీ నుంచి ఏడాది లోపు జన్మించిన అదనపు శిశువును పరిగణనలోకి తీసుకోకూడదు. ఈ చట్టం అమలు తేదీ నాటికి ఒక వ్యక్తికి ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉండొచ్చు. ఒకవేళ మహాలక్ష్మి, నాగదుర్గలకు ఈ నిబంధన వర్తిస్తే...వారు పోటీకి అర్హులే. అలా చూసినా సరే...ఇద్దరికీ కవల పిల్లలు, ఒక శిశువు కలిపి ముగ్గురు పిల్లలున్నప్పటికీ నాగదుర్గకు జరిగింది అన్యాయమేనన్న విమర్శలు వస్తున్నాయి. కవల పిల్లలు ముందు పుట్టినా...తర్వాత పుట్టినా మొత్తం పిల్లల సంఖ్య మూడే కదా అన్నవాదనలు వినిపిస్తున్నాయి.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.