పంచాయతీ ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీలు బలపరిచిన అభ్యర్థులను బెదిరించి, భయపెట్టి బలవంతపు ఏకగ్రీవాలు, నామినేషన్ల విత్ డ్రాలకు వైసీపీ పాల్పడిందని తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ నేతల తీరు మారలేదని విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ నేతలు కొత్త తరహా అక్రమాలకు తెరతీశారని ఆరోపణలు వస్తున్నాయి.
ప్రత్యర్థి అభ్యర్థి సంతకం ఫోర్జరీ చేసి మరీ నామినేషన్ ఉపసంహరణ చేయడం వంటి కొత్త ట్రెండ్ కు వైసీపీ నేతలు శ్రీకారం చుట్టారని ఆరోపణలు వస్తున్నాయి. ఫోర్జరీతో తన నామినేషన్ విత్ డ్రా చేశారని తిరుపతి 7వ వార్డు అభ్యర్థి విజయలక్ష్మి ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. ఈ వ్యవహారంపై పత్రికల్లో కథనాలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
ఈ ఫోర్జరీ ఘటనను ఎన్నికల నేరంగా పరిగణిస్తున్నామని, ఆ వార్డు ఎన్నిక ప్రక్రియను సస్పెండ్ చేస్తున్నామని ఆయన ప్రకటించారు. ఈ ఫోర్జరీకి సంబంధించి ప్రాథమిక సాక్ష్యాధారాలున్నాయని, విచారణ కొనసాగుతోందని స్పష్టం చేశారు. విచారణ పూర్తయిన తర్వాత ఎన్నికల ప్రక్రియపై తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ ఫోర్జరీ ఘటన నేపథ్యంలో ఎస్ఈసీ మరో సంచలన నిర్ణయం తీసుకుంది.
అభ్యర్థి మినహా ఇతరులు నామినేషన్ ఉపసంహరణ పత్రం ఇస్తే తీసుకోకూడదని అధికారులకు నిమ్మగడ్డ స్పష్టం చేశారు. అది ఉపసంహరణగా పరిగణించకూడదని చెప్పారు. బలవంతపు ఉపసంహరణలపై పత్రికల్లో కథనాలు వచ్చాయని, వాటిని ఎస్ఈసీ సీరియస్గా పరిగణిస్తుందన్నారు. తిరుపతి 7వ వార్డు ఫోర్జరీ ఘటనపై పోలీసులు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఎస్ఈసీ తెలిపింది. ఈ తరహా ఘటనలను వెంటనే ఎస్ఈసీ దృష్టికి తీసుకురావాలని నిమ్మగడ్డ కోరారు.