ఏపీలో పంచాయతీ ఎన్నికల వేడి రాజుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల నియమావళి ప్రకారం ఏఏ ప్రభుత్వ పథకాలు అమలు చేయాలి…వేటిని ఆపాలి అన్నదానిపై నిమ్మగడ్డ కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే పలు పథకాలపై సీఎం జగన్ ఫొటోను తొలగించాలని నిమ్మగడ్డ ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఏపీలో మొదలైన ఇంటింటికీ రేషన్ పంపిణీ కార్యక్రమంపై నిమ్మగడ్డ ఫోకస్ చేశారు. తన కార్యాలయలంలో 2 రేషన్ పంపిణీ వాహనలను ఎస్ఈసీ పరిశీలించారు. పంపిణీ ఏ రకంగా జరుగుతుందన్న విషయాన్ని పౌరసరఫరాలశాఖ కమీషనర్ కోన శశిధర్ ను అడిగి తెలుసుకున్నారు.రేషన్ డోర్ డెలివరీ వాహనంలో ఎక్కిన నిమ్మగడ్డ…. వాహనం డ్రైవర్ కేబిన్లో కూర్చుని వాహనాన్ని నిశితంగా పరిశీలించారు.
వాహనాలలో ఉన్న సదుపాయాలు, వాటి వినియోగం గురించి అడిగి తెలుసుకున్నారు. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆఫీసుకు, రేషన్ డెలివరీ వాహనాలను పౌరసరఫరాల శాఖ అధికారులు తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలోనే రేషన్ పంపిణీ వాహనాలకు నిమ్మగడ్డ బ్రేక్ వేయనున్నారని తెలుస్తోంది. ఆ వాహనంపై జగన్ ఫొటో..ఉండడం ఎన్నికల నియమావళికి విరుద్ధమన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఆ వాహనాలు ప్రజలను ప్రలోభపెట్టేలా ఉన్నాయని టీడీపీ నేతలు అంటున్నారు. అయితే, ఈ పథకం చాలారోజుల ముందే అమలు కావాల్సి ఉందని, ఇది పాత పథకం కాబట్టి ఎన్నికల కోడ్ పరిధిలోకి రాదని వైసీపీ నేతలు చెబుతున్నారు. మరి, ఈ వాహనాలపై నిమ్మగడ్డ నిర్ణయం ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.