నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును అర్ధరాత్రిపూట అక్రమంగా అరెస్టు చేసిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. కస్టడీలో రఘురామపై రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించి కొట్టారన్న ఆరోపణలు సంచలనం రేపాయి. ఆ తర్వాత రఘురామ బెయిల్ పై విడుదల కావడం తెలిసిందే. అయితే, తన తండ్రిని అరెస్ట్ చేసిన తీరు, తదనంతర పరిణామాలపై రఘురామకృష్ణరాజు తనయుడు భరత్ చేసిన ఫిర్యాదుపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్ హెచ్ఆర్ సీ) గతంలోనే స్పందించింది.
ఈ విషయంలో వివరణ ఇవ్వాలంటూ ఏపీ డీజీపీ, హోంశాఖ ముఖ్య కార్యదర్శికి ఎన్ హెచ్ఆర్ సీ నోటీసులు జారీ చేసింది. 4 వారాల్లోగా ఆ నోటీసులకు బదులివ్వాలని మే28న స్పష్టం చేసింది. దీంతోపాటు, సీఐడీ కస్టడీలో రఘురామపై పోలీసులు దాడి చేశారన్న ఆరోపణలపైనా జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించింది. ఈ వ్యవహారంపై అంతర్గత విచారణ జరపాలని ఏపీ సీఐడీ డీజీని ఆదేశించింది. జూన్ 7 లోగా ఈ అంశంపై నివేదిక ఇవ్వాలని నిర్దేశించింది.
ఈ నేపథ్యంలో తాజాగా జగన్ సర్కార్ పై జాతీయ మానవ హక్కుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. రఘురామ అరెస్టు వ్యవహారంపై నివేదిక పంపాలని జారీ చేసిన నోటీసులపై ఇప్పటిదాకా స్పందించకపోవడంపై ఎన్హెచ్ఆర్సీ అసహనం వ్యక్తం చేసింది. నివేదిక ఎందుకు జాప్యం అవుతోందో చెప్పాలని ఏపీ సర్కార్ ను ఎన్హెచ్ఆర్సీ నిలదీసింది.
తాజాగా ఏపీ హోంశాఖ కార్యదర్శి, డీజీపీకి ఎన్హెచ్ఆర్సీ సమన్లు జారీ చేసింది. ఆగస్టు 9 లోపు రఘురామ వ్యవహారంలో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఒకవేళ గడువులోగా నివేదిక ఇవ్వకుంటే ఆగస్టు 16న వ్యక్తిగతంగా హాజరుకావాల్సి ఉంటుందని హోంశాఖ కార్యదర్శి, డీజీపీని హెచ్చరించింది.