కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్ ను ఢీకొట్టేందుకు బీఆర్ఎస్ ను సీఎం కేసీఆర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఎన్డీఏ కూటమి ఓటమే లక్ష్యంగా భారత్ రాష్ట్ర సమితిని కేసీఆర్ ఏర్పాటు చేశారు. బీజేపీ వ్యతిరేక పార్టీలన్నింటినీ ఒక్కతాటిపైకి తెచ్చి నరేంద్ర మోడీని గద్దె దించడమే టార్గెట్ గా కేసీఆర్ వ్యూహ రచన చేస్తున్నారు. అయితే, కేసీఆర్ ఎత్తులను నిశితంగా పరిశీలిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఆయనకు తాజాగా షాక్ ఇచ్చినట్లు కనిపిస్తోంది.
బీఆర్ఎస్ ను ప్రకటించి 24 గంటలు గడవక ముందే తెలంగాణ ప్రభుత్వంపై కేంద్రం ఊహించని విధంగా కక్ష సాధించినట్లు కనిపిస్తోంది. వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణాన్ని ఆపేయాలంటూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సంచలన తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో ఆ తీర్పుపై మంత్రి జగదీశ్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టును ఆపేందుకు ఎవరో కుట్ర పన్నారని అనుమానం వ్యక్తం చేశారు.
అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతే ఆ ప్లాంట్ నిర్మాణాన్ని చేపట్టామని జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. వేల కోట్లు ఖర్చుపెట్టి నిర్మాణం చేపట్టామని, ఇపుడు అర్ధాంతరంగా నిర్మాణం ఆపమని చెప్పడం, దానికి వ్యతిరేకంగా తీర్పునివ్వడం సరికాదని జగదీష్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ట్రైబ్యునల్ తీర్పు ఏకపక్షంగా ఉందని, దేశం మొత్తానికి ఈ తీర్పు వల్ల నష్టమని ఆయన అన్నారు. ఈ తీర్పును సవాల్ చేస్తామని, రివ్యూ పిటిషన్ వేస్తామని చెప్పారు.
ముందుగా అనుకున్న సమయానికే ప్లాంట్ ను పూర్తిచేసి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.
అయితే, మోడీ హయాంలో ఈడీ, సీబీఐ, ఈసీ వంటి సంస్థలు తమ స్వయం ప్రతిపత్తిని కోల్పోయి కేంద్రం చేతిలో కీలుబొమ్మల్లా మారాయని, ఆ కోవలోనే ఎన్జీటీ కూడా చేరి యాదాద్రి థర్మల్ ప్లాంట్ ఆపాలని తీర్పు చెప్పిందని సోషల్ మీడియాలో బీఆర్ఎస్ అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా ఉన్న ఎన్జీటీ ఇప్పుడే ఆ ప్రాజెక్ట్ నకు వ్యతిరేకంగా స్పందించడం ఏమిటని అంటున్నారు.