రాజకీయాల్లో పార్టీలు మారడం, కండువాలు మార్చుకోవటం సహజం. ఇప్పుడు వైసీపీ కీలక నాయకుడు మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ఇదే పని చేస్తున్నారు. ఆయన త్వరలోనే జనసేనలోకి చేరాలని నిర్ణయించుకున్నారు. అయితే ఆయనకు పార్టీ మార్పు వల్ల వచ్చే ప్రయోజనం పెద్దగా ఏమీ కనిపించడం లేదన్నది ఒంగోలులో వినిపిస్తున్నటువంటి మాట. ఎందుకంటే ఆది నుంచి కూడా టిడిపి నాయకులతో ఆయన రాజకీయ సమరం చేస్తూనే ఉన్నారు.
ముఖ్యంగా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఫ్యామిలీతో బాలినేని వర్గానికి పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేటటువంటి రాజకీయ పరిణామాలు, పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఆయన పార్టీ మారి జనసేనలోకి వెళ్లినా.. కూటమి ప్రభుత్వంలో పెద్దగా ప్రాధాన్యం ఉండే అవకాశాలు కనిపించడం లేదు. ఈ విషయంపైనే దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ.. బాలినేని రాకను తప్పుపట్టారు. బాలినేని చేసిన తప్పులను వదిలిపెట్టేది లేదని గత ప్రభుత్వంలో చోటు చేసుకున్న అక్రమాలను వెలికి తీస్తామన్నారు.
తద్వారా బాలినేని వ్యవహారాన్ని మరింత కీలకంగా మార్చారు. వాస్తవానికి పార్టీ మారిన తర్వాత ఊరట లభించడం సహజంగా నాయకులకు దక్కే కీలక పరిణామం. ఈ విషయంలో బాలినేనికి సెగ తప్ప స్వాంతన లభించే అవకాశం కనిపించడం లేదు. బాలినేని తోపాటు ఆయన కుమారుడు అవినీతికి పాల్పడ్డారని అక్రమాలు చేశారని ఎమ్మెల్యే దామచర్ల గట్టిగానే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తాము ఆయా కేసులను బయటకు తెస్తామని కూడా ఆయన అంటున్నారు.
ఇది బాలినేని వర్గానికి మింగుడు పడటం లేదు. వైసీపీ నుంచి జనసేనలోకి వెళ్లినా పెద్దగా ప్రయోజనం ఏమి లేదనే భావన భక్తమవుతోంది. మొత్తంగా చూస్తే బాలినేనికి సెగే తప్ప స్వాంతన అయితే కనిపించ డం లేదు. మరి రాజకీయంగా ఆయన ఎలాంటి పరిణామాలు ఎదుర్కొంటారు. ఎలాంటి సమస్యల్లో నుంచి బయటపడతారు అనేది చూడాలి. పైగా దశాబ్దాలుగా విభేదాలతో ఉన్న నాయకులను కలుపుకొని పోవడం అనేది ఇప్పుడు బాలినేనికి అగ్ని పరీక్షేనని అంటున్నారు.