సమాజం అంగీకరించనప్పటికీ.. చాలామంది ఒప్పుకోనప్పటికీ చట్టపరంగా ఇద్దరు మేజర్లు కలిసి ఉండటం.. లివ్ ఇన్ రిలేషన్ లో ఉండటం వల్ల ఎలాంటి ఇబ్బందులు లేవు. అలాంటి వారిపై చట్టప్రకారం చర్యలు.. శిక్షలకు అవకాశం లేదు. కానీ.. ఇదంతా ఇప్పుడు కాదు. దేశంలోని ఉత్తరాఖండ్ ఇప్పుడు కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. దీని ప్రకారం లివ్ ఇన్ లో ఉండే వారు ప్రభుత్వ అధికారులకు తమ రిలేషన్ కు సంబంధించిన సమాచారాన్ని ఇవ్వాలి. లేకుంటే.. వారిపై చట్టపరమైన చర్యలకు.. శిక్ష విధించేందుకు అవకాశం కల్పిస్తూ కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు.
అల్లంత దూరాన ఉన్నట్లుగా కళ్ల ముందు కదలాడే హిమాలయ పర్వతాల అందాలతో మెరిసే ఉత్తరాఖండ్ లో తీసుకొచ్చిన సరికొత్త చట్టం సంచలనంగా మారింది. మతం.. లింగం.. లైంగికతతో సంబంధం లేకుండా రాష్ట్రంలో నివసించే ప్రజలందరికీ ఒకే చట్టాన్ని అమలు చేసే యూసీసీ (యూనిఫాం సివిల్ కోడ్) అక్కడి బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇందులో భాగంగా పెళ్లి కాకుండా ఇద్దరు మేజర్లు తమ ఇష్టపూర్వకంగా కలిసి ఉండే సంబంధాన్ని సహజీవనం (లివ్ ఇన్ రిలేషన్) పేరుతో కలిసి ఉంటారు. అయితే.. ఇకపై అలా ఉండాలంటే
కొత్త చట్టంలో పేర్కొన్న విధంగా వారు చేయాల్సి ఉంటుంది.
ఒక పురుషుడు.. ఒక స్త్రీ సహజీవనంలో ఉన్నపక్షంలో ఆ విషయాన్ని వారు తప్పనిసరిగా రిజిస్ట్రార్ కు తెలియజేయాల్సి ఉంటుంది. ఈ అంశంపై సదరు అధికారి 30 రోజుల్లోపు విచారిస్తారు. విచారణలో భాగంగా అవసరమైన అదనపు సమాచారాన్ని కోరితే.. అందుకు సదరు జంట సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది. అనంతరం సహజీవనం చేస్తున్న జంట వివరాల్ని స్థానిక పోలీసులకు అందజేస్తారు.ఒకవేళ.. వారిద్దరి ఎవరి వయసు అయినా 21 ఏళ్ల కంటే తక్కువగా ఉంటే.. ఆ విషయాన్ని వారి తల్లిదండ్రులకు సమాచారం అందిస్తారు.
తమ విచారణలో అధికారి ఓకే అంటే ఫర్లేదు. అలాంటి జంటల్ని గుర్తిస్తూ వారి సహజీవన సంబంధాన్ని నమోదు చేసిన సర్టిఫికేట్ ను జారీ చేస్తారు.
లేదంటే తాము ఎందుకు రిజెక్టు చేశామన్న విషయాన్ని సదరు జంటకు తెలియజేస్తారు. ఒకవేళ.. సదరు జంటలో అప్పటికే పెళ్లై ఉన్నా.. మైనర్ అయినా.. బలవంతంగా కానీ.. మోసపూరితంగా కానీ సంబంధాన్ని ఏర్పర్చుకున్నట్లు భావిస్తే.. వారి రిలేషన్ ను రిజిస్ట్రార్ రిజెక్టు చేసే వీలుంది. అంతేకాదు.. ఒకవేళ లివ్ ఇన్ లో ఉన్న జంట తమ రిలేషన్ కు బ్రేకప్ చెప్పాలని భావిస్తే.. ఆ విషయాన్ని సదరు అధికారికి తెలియజేస్తే.. అందుకు తగ్గ ఉత్తర్వులు జారీ చేస్తారు. దీంతో.. వారి బంధం ముగించొచ్చు. సంబంధం రద్దు వివరాల్ని పోలీసులకు సమాచారం అందిస్తారు.
అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నెల రోజుల కంటే ఎక్కువ కాలం సహజీవనంలో ఉంటే మాత్రం అలాంటి వారు శిక్షార్హులు అవుతారు.వారికి 3 నెలలు జైలుశిక్షతో పాటు రూ.10వేలు జరిమానా కానీ రెండింటిని కానీ విధించే వీలుంది. తప్పుడు సమాచారం ఇచ్చినా.. నిజాల్ని దాచి ఉంచినా మూడు నెలల జైలు.. రూ.25వేల ఫైన్ విధించే వీలుంది. అయితే.. ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. ఈ చట్టాన్ని న్యాయ నిపుణులు తప్పు పడుతున్నారు. వ్యక్తిగత గోప్యత అన్నది ప్రాథమిక హక్కుగా సుప్రీంకోర్టు చెప్పిందని.. తాజా చట్టంలో అదేమీ ఉండదని స్పష్టం చేస్తున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.