ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ వ్యవహారంపై పెను దుమారం రేగిన సంగతి తెలిసిందే. ఉద్యోగులు వర్సెస్ జగన్ సర్కార్ అన్న తీరులో నడిచిన వ్యవహారం చివరకు చర్చలతో ముగిసింది. కొన్ని డిమాండ్లకు ప్రభుత్వం ఓకే చెప్పడంతో ఉద్యోగులు కూడా మెత్తబడ్డారు. అయితే, ఉపాధ్యాయులు మాత్రం ఇంకా జగన్ సర్కార్ పై అసంతృప్తితో ఉన్నారు. అయినప్పటికీ మొండిగా ఉన్న ప్రభుత్వం తాజాగా సవరించిన పీఆర్సీ జీవోను విడుదల చేసింది.
ఏపీ సచివాలయ ఉద్యోగులు, హెచ్‌వోడీ కార్యాలయాల ఉద్యోగులకు 24 శాతం హెచ్ఆర్ఏను అందించనుంది. 2022 జనవరి 1 నుంచి హెచ్ఆర్ఏ పెంపు ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని ఉత్తర్వులు జారీ చేసింది. హెచ్ఆర్ఏ గరిష్ఠ పరిమితిని రూ. 25 వేలకు నిర్ధారించింది. ఏపీ భవన్, హైదరాబాద్‌లలో పనిచేసే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు 24 శాతం హెచ్ఆర్ఏ వర్తిస్తుందని పేర్కింది. 2.5 లక్షల జనాభా ఉన్న పట్టణాలు, 13 జిల్లా కేంద్రాల్లో బేసిక్ పే పైన 16 శాతం హెచ్ఆర్ఏ లేదా రూ.17వేల సీలింగ్‌ను నిర్ణయించింది.
2 లక్షల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో 12 శాతం హెచ్ఆర్ఏను రూ.13 వేలకు మించకుండా సీలింగ్ విధించింది. 50 వేలలోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.11వేల సీలింగ్‌తో 10 శాతం హెచ్ఆర్ఏ ఇవ్వనుంది. రిటైర్డ్ ఉద్యోగులకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌ను నిర్ధారించింది ప్రభుత్వం. 70 ఏళ్ల వయసున్న రిటైర్డ్ ఉద్యోగికి అదనంగా 7 శాతం పెన్షన్, 75 ఏళ్ల వయసు వారికి అదనంగా 12 శాతం, 80 ఏళ్ల వారికి అదనంగా 20 శాతం, 85 ఏళ్ల వారికి అదనంగా 25 శాతం, 90 ఏళ్ల వయసు వారికి అదనంగా 30 శాతం, 95 ఏళ్ల వయసు రిటైర్డ్ ఉద్యోగికి అదనంగా 35 శాతం, 100 ఏళ్లకు పైగా వయసు వారికి అదనంగా 50 శాతం పెన్షన్ అందుతుంది.