కరోనా-లాక్డౌన్ కారణంగా మూతపడి రెండు నెలల విరామం తర్వాత ఏపీలో మద్యం దుకాణాలు తెరుచుకోగానే మందు బాబులకు పెద్ద షాకులే ఇచ్చింది ప్రభుత్వం. మద్యం ధరల్ని ఒకేసారి ఏకంగా 75 శాతం పెంచేయడమే కాక.. పేరున్న బ్రాండ్లేవీ అందుబాటులో లేకుండా చేశారు. దీంతో మందుబాబులు అల్లాడిపోయారు.
ఇదేమంటే.. మందుబాబులను మద్యానికి దూరం చేయడంలో భాగంగా, మద్య నిషేధం దిశగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లుగా అధికార పార్టీ వర్గాలు సమర్థించుకున్నాయి. ఐతే దీని కారణంగా ఏపీ బార్డర్లో మద్యం తరలింపు, అక్రమ వ్యాపారం విపరీతంగా పెరిగిపోయింది. దీంతో ఏపీ మద్యం ఆదాయానికి గండి పడింది.
ఐతే మద్యం ధరల పెంపు విషయంలో ఇన్నాళ్లూ ఎన్ని విమర్శలు లెక్క చేయని జగన్ సర్కారు.. ఎట్టకేలకు ధరలు తగ్గించింది. 25 నుంచి 30 శాతం ధరలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇది మందు బాబులకు కాస్త ఉపశమనం కలిగించే విషయమే. ఐతే ఇప్పుడు ప్రభుత్వం ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందన్న ప్రశ్న తలెత్తుతోంది. బార్డర్లలో అక్రమ మద్యం తరలింపు, వ్యాపారాన్ని నియంత్రించడం ఇందుకో కారణం కాగా.. రాబోయే స్థానిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కూడా ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని భావిస్తున్నారు.
ఐతే మద్య నిషేధంలో భాగంగా, మందుబాబులను నిరుత్సాహానికి గురి చేయడం కోసమే ఇంతకుముందు ధరలు పెంచినట్లు చెప్పుకున్న వైసీపీ మద్దతుదారులు.. ఇప్పుడు ధరల తగ్గింపుపై ఏమంటారో చూడాలి.