అనంత విశ్వంలో బోలెడన్ని అద్భుతాలు.. అంతకు మించినవెన్నో. సాంకేతికంగా మనిషి ఎంతలా డెవలప్ అవుతున్నా.. తాను సాధించాల్సిన దానితో పోలిస్తే.. చాలా తక్కువే చేయగలుగుతున్నాడు. భూగ్రహాన్ని పోలినట్లుగా ఉండే గ్రహం జాడల కోసం మనిషి ఎంతో కాలంగా వెతుకుతున్న విషయం తెలిసిందే. అలాంటిది తొలిసారి అనంత విశ్వంలో మొత్తం నీళ్లతో ఉన్న గ్రహాన్ని గుర్తించారు.
ఈ అద్భుతాన్ని యూనివర్సిటీ ఆఫ్ మాంట్రిల్ కు చెందిన ఖగోళ శాస్త్రవేత్త కనుగొన్నారు. ప్రస్తుతం ఈ గ్రహాన్ని ‘‘టాయ్ 1452బి’’ గా వ్యవహరిస్తున్నారు. ఈ గ్రహం ఒక బుల్లి నక్షత్రం చుట్టూ తిరుగుతోంది. భూమికి వంద కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న డ్రాగన్ నక్షత్రాన్ని ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. డ్రాగన్ నక్షత్ర కూటమిలోని బైనరీ వ్యవస్థలో సరిగ్గా మన భూమి లాంటి గ్రహమే ఉన్న విషయాన్ని వారు కనుగొన్నారు.
భూమి కంటే 70 శాతం పెద్దదిగా ఉండే ఈ గ్రహంలో ఎక్కడ చూసినా దట్టంగా నీళ్లే ఉన్నట్లుగా గుర్తించారు. అంతేకాదు.. ఇదో చిన్న నక్షత్రం చుట్టూ తిరుగుతోందని.. ఈ గ్రహం మీద ఉన్న నీళ్లు అతి చల్లగా కానీ.. అతి వేడిగా కానీ ఉండే అవకాశం లేదని పేర్కొన్నారు. దీన్ని సముద్ర గ్రహంగా వ్యవహరిస్తున్నారు. అత్యంత కచ్ఛితమైన కొలతల కోసం మరింత కసరత్తు చేస్తున్నారు. మొత్తానికి మనిషి కన్ను పడిన ఈ సముద్ర గ్రహం భవిష్యత్తు ఏ రీతిలో ఉండనుందన్నది ఆసక్తికర అంశంగా చెప్పక తప్పదు.