ఆయన ప్రపంచ బౌద్ధ గురువుగా భాసిల్లుతున్న బౌద్ధ సన్యాసి. అయితేనేం.. ఒక్క చిన్న వ్యవహారం..ఆయనను సమాజం ముందు.. తలెత్తుకోలేకుండా చేసింది. అంతేకాదు.. నిన్నటి వరకు దలైలామా పట్ల ఉన్న గౌరవం తమకు పోయిందంటూ..అనేక మంది నెటిజన్లు వ్యాఖ్యలు చేశారు. ఇంకొందరు.. `ఛీ-ఛీ` అని ఈసడించుకున్నారు. దీంతో దలైలామా.. తొలిసారి తన జీవితంలో ప్రపంచానికి క్షమాపణలు చెప్పారు. `నన్ను క్షమించండి` అని ఆయన వేడుకున్నారు. అయినా.. కూడా నెటిజన్లు శాంతించడం లేదు. దీంతో ఆయన పరిస్థితి ఎటు మలుపు తిరుగుతుందో చూడాలి.
ఏం జరిగింది..?
బౌద్ధ మత గురువు దలైలామా.. ఓ బాలుడితో వ్యవహరించిన తీరు తీవ్ర వివాదాస్పదమైంది. బాలుడిని పెదాలపై ముద్దు పెట్టడం, తన నాలుకను నోటితో తాకాలని కోరిన దలైలామా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఆయన తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే, దీనిపై దలైలామా స్పందించారు. ఆ బాలుడికి, అతడి కుటుంబానికి, ఈ ప్రపంచానికి కూడా క్షమాపణలు చెప్పినట్లు తెలిపారు. ఈ మేరకు తన ట్విట్టర్ వేదికగా అధికారిక ప్రకటన విడుదల చేశారు.
”మిమ్మల్ని కౌగిలించుకోవాలని ఉంది’ అని ఓ బాలుడు దలైలామాను కోరారు. ఆ సమయంలో వారి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన.. 2 నిమిషాల 5 సెకన్లు ఉన్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందులో ఆయన చేసిన వ్యాఖ్యలు, తీరు ఎవరినైనా బాధించి ఉంటే.. అందుకు ఆ బాలుడు, అతడి కుటుంబానికి దలైలామా క్షమాపణలు తెలియజేస్తున్నారు. దలైలామా.. తనను కలిసే వ్యక్తులు.. ముఖ్యంగా చిన్నారులతో సరదాగా ఉంటారు. కొన్ని సార్లు వారిని ఆటపట్టిస్తుంటారు కూడా. బహిరంగ సభల్లో, కెమెరాల ముందైనా ఆయన అలాగే ఉంటారు. జరిగిన దానికి (వైరల్ వీడియోను ఉద్దేశిస్తూ) దలైలామా విచారం వ్యక్తం చేస్తున్నారు” అని దలైలామా బృందం ఆ ప్రకటనలో తెలిపింది.
తన వద్ద ఆశీర్వాదం తీసుకునేందుకు వచ్చిన ఓ భారతీయ బాలుడిని దగ్గరకు తీసుకొన్న దలైలామా.. అతడి పెదవులపై ముద్దు పెట్టిన వీడియో వైరల్గా మారింది. ఆ వీడియోలో.. దలైలామా తన నాలుకను బయటపెట్టి.. ‘నీ నోటితో నా నాలుకను తాకుతావా’ అని బాలుడిని అడగడం వినిపించింది. దీంతో ఆయన తీరుపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర దుమారం రేగింది. నెటిజన్లు తీవ్రంగా మండిపడ్డారు. ఇలాంటి ప్రవర్తనను సహించకూడదని పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీంతో ఆయన ప్రపంచానికి క్షమాపణలు చెప్పారు. మరి ఇప్పటికైనా నెటిజన్లు శాంతిస్తారో లేదో చూడాలి.