ఈ మధ్యకాలంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి, వారి తనయుడు నారా లోకేష్, వారి కోడలు నారా బ్రాహ్మణిలపై సోషల్ మీడియాలో విమర్శలు గురించడం ఒక ఫ్యాషన్ అయిపోయింది అని టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. నారావారి కుటుంబాన్ని పనిగట్టుకొని అవమానించేలాగా పోస్టులు పెట్టడం, అదేదో ఘనకార్యం చేసినట్టుగా ఫీల్ అయిపోవడం కొందరికి అలవాటుగా మారింది.
అయితే, ఇటువంటి పోస్టులు పెడుతున్న వారిపై టీడీపీ నేతలు ఎప్పటికప్పుడు ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు. అయినా, సరే ఏదో ఒక రకంగా పాపులర్ అయిపోవాలన్న కారణంతోనో, లేదంటే డబ్బుల కోసమో కొందరు ఆకతాయిలు మాత్రం టీడీపీ అధినేత కుటుంబంపై బురదజల్లడం ఆపడం లేదు. ఈ నేపథ్యంలోనే నారా బ్రాహ్మణిపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన వ్యక్తికి టీడీపీ నేతలు దేహశుద్ధి చేశారు.
కృష్ణా జిల్లాకు చెందిన కోదాటి నరసింహ అనే వ్యక్తి ఖమ్మం జిల్లా టేకులపల్లిలో ఆర్ఎంపీ గా పని చేస్తున్నారు. అతడు, తన ఫేస్బుక్ పేజీలో నారా బ్రాహ్మణిని వ్యక్తిగతంగా కించపరుస్తూ పోస్ట్ పెట్టారు. దీంతో, ఈ విషయంపై టీడీపీ నాయకులు….నరసింహాకు ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు ఇటువంటి పోస్టులు పెడుతున్నావని ప్రశ్నించారు. ఆ తర్వాత నేరుగా నరసింహను టీడీపీ నేతలు కలిశారు.
ఈ క్రమంలోనే అతడు..టీడీపీ నాయకులతో దురుసుగా ప్రవర్తించాడు. ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెడతానని దురుసుగా సమాధానం ఇవ్వడంతో టిడిపి నేతలు కొద్దిసేపు వాగ్వాదం అనంతరం నరసింహకు దేహశుద్ధి చేశారు. ఈ క్రమంలోనే నరసింహకు తగిన శాస్తి జరిగిందని, ఇలాగే దేహశుద్ధి చేస్తే ఇంకోసారి ఇటువంటి పోస్టులు పెట్టరని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.