టీ20 ప్రపంచకప్ టోర్నీలో టైటిల్ ఫేవరెట్ గా చెబుతున్న సౌతాఫ్రికా జట్టుకు ఘోర పరాభవం ఎదురైంది.
టీ20 ప్రపంచకప్ లో పెను సంచలనం నమోదైంది. కలలో కూడా ఊహించనివి క్రికెట్ లో చోటు చేసుకుంటాయన్న మాటతో పాటు.. ఈ ఆటలోఏదీ అసాధ్యం కాదన్నది ఎంత నిజమన్న విషయం.. తాజాగా జరిగిన మ్యాచ్ ను చూస్తే తెలుస్తుంది.
అంచనాలు ఏ మాత్రం లేని నెదర్లాండ్స్ జట్టును పసికూనలుగా పరిగణిస్తారు. అలాంటి జట్టు సఫారీ జట్టుపై సాధించిన సంచలన విజయం ఇప్పుడు షాకింగ్ గా మారింది.
క్రికెట్ ప్రపంచంలో ఇదో సంచలన ఫలితంగా చెప్పాలి.
నెదర్లాండ్స్ తో దక్షిణాఫ్రికా మ్యాచ్ ను ఆ జట్టుకు ప్రాక్టీస్ మ్యాచ్ గా భావించారు.
అందుకు భిన్నంగా ఆ జట్టు మాత్రం సఫారీలకు దారుణమైన అనుభవాన్ని మిగిల్చింది.
ఈ మ్యాచ్ ఫలితం ఆ జట్టు మీద ఎంతటి ప్రభావాన్ని చూపనుందంటే.. ఏకంగా టోర్నీ నుంచే నిష్క్రించాల్సిన పరిస్థితికి వచ్చింది.
తదుపరి బంగ్లాదేశ్ తో జరిగే మ్యాచ్ లో పాకిస్థాన్ కానీ గెలిస్తే.. దక్షిణాఫ్రికా జట్టు టోర్నీ నుంచి బయటకు వెళ్లిపోవాల్సి ఉంటుంది.
అదే జరిగితే సెమీస్ లో మరోసారి భారత్.. పాకిస్థాన్ లు తలపడనున్నాయి.
అందులో గెలిచిన జట్టు ఫైనల్ కు చేరుతుంది. ఇక.. సంచలన మ్యాచ్ విషయానికి వస్తే.. దక్షిణాఫ్రికా జట్టు టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంపిక చేసుకుంది.
నెదర్లాండ్స్ బ్యాట్స్ మెన్లు స్టెఫాన్ మైబుర్గ్.. మ్యాక్స్ ఓడౌడ్.. టామ్ కూపర్.. కొలిన్ అకెర్ మన్ లు ఒక మోస్తరుగా రాణించి.. సరాసరిగా ఒక్కొక్కరు 35 పరుగులు చేశారు. మొత్తంగా 158 పరుగులు చేసింది. దీంతో లక్ష్య సాధనకు దిగిన దక్షిణాప్రికా జట్టుకు ఊహించని షాక్ తగిలింది.
నెదర్లాండ్స్ బౌలర్లు అద్భుతంగా రాణించటంతో ఒకటి తర్వాత ఒకటి చొప్పున వికెట్ సమర్పించుకోవటంతో సఫారీ బ్యాట్సె మెన్ల మీద ఒత్తిడి పెరిగింది.
దీంతో.. రన్ రేట్ మీద ప్రభావాన్ని చూపింది. వికెట్ కాపాడుకోవటమే లక్ష్యంగా మారి.. చివరకు కొండలా మారిన పరుగుల్ని చేధించలేక చతికిల పడింది.
20 ఓవర్లు ముగిసే నాటికి 8 వికెట్ల నష్టానికి 145 పరుగులకే పరిమితమైంది. పదమూడు పరుగుల తేడాతో దారుణ ఓటమిని మూటగట్టుకుంది.
సఫారీ లాంటి జట్టుకు ఎదురైన ఈ ఓటమి వారికి దారుణ పరాభవంగా మారిందని చెప్పాలి. సపారీ బ్యాట్స్ మెన్లలో రిలీ రొస్సో ఒక్కరు మాత్రమే పాతిక పరుగులు చేశారు. ఇదే ఈ మ్యాచ్ లో ఆ జట్టు సభ్యుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్.