రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగొచ్చు. ముఖ్యంగా ఎన్నికలకు ముందు.. పార్టీ పరిస్థితులు ఎలాగైనా మారొచ్చు. ఇప్పుడు నెల్లూరు జిల్లాలో టీడీపీ రాజకీయాలు పుంజుకుంటున్నాయా? అనే చర్చ సాగుతోంది. ఇంతకు ముందు ఉన్న జోరు, హోరు ఇక్కడ నాయకుల్లో కనిపిస్తోందని అంటున్నారు. గత ఎన్నికల తర్వాత కూడా ఇక్కడ నాయకులు పార్టీ కార్యక్రమాల్లోను, వ్యక్తి గతంగా చంద్రబాబు చేపడుతున్న కార్యక్రమాలకు హుషారుగా పాల్గొంటున్నారు.
అయితే, కీలకమైన బీసీ నాయకుడు బీద మస్తాన్రావు వైసీపీలోకి వెళ్లిపోవడంతో రవిచంద్రయాదవ్ ఒక్కరే పార్టీలో ఉన్నారు. అయినా, ఆయన పార్టీలో జోరుగా పనిచేస్తున్నారు. అన్నీతానై రవిచంద్ర పార్టీ విషయంలో చక్రం తిప్పిన సందర్భాలు ఉన్నాయి. మరోవైపు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా.. పార్టీ తరఫున బాగానే వాయిస్ వినిపిస్తున్నారు. ఇటీవల కాలంలో అంశాల వారీ రాజకీయాలు చేస్తున్నారు.
అదేసమయంలో వైసీపీ నుంచి వచ్చే నాయకుల కోసం టీడీపీ రెడ్ కార్పెట్ రెడీ చేసింది. ముఖ్యంగా ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి కుటుంబం నుంచి ఒకరిద్దరు టీడీపీ తీర్థం పుచ్చుకుంటారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇదే సమయంలో కొవ్వూరు, సర్వేపల్లి, వెంకటగిరి, నెల్లూరు రూరల్, సిటీ నియోజకవర్గాల్లో టీడీపీ ప్రస్తావన జోరుగా సాగుతోంది.
గతానికి మించిన పరిస్థితి ఇప్పుడు కనిపిస్తోందని అంటున్నారు. మాజీ మంత్రి అనిల్ .. ప్రస్తుత మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిల మధ్య వివాదాలతో పార్టీ పరిస్థితి ఇబ్బందిలో పడింది. దీంతో టీడీపీపై ప్రజలకు విశ్వాసం పెరిగిందని అంటున్నారు. వచ్చే ఎన్నికలకు ఇంకా చాలానే సమయం ఉన్న నేపథ్యంలో నాయకులు మరికొంత పుంజుకుంటే టీడీపీ ఇక్కడ మెజారిటీ స్థానాలు దక్కించుకుంటుందని అంటున్నారు.