మూలిగే నక్క మీద తాటిపండు పడిన చందంగా సెకండ్ వేవ్ చాలా రంగాల్ని తీవ్రంగా దెబ్బ తీసింది. కరోనా మొదటి వేవ్ ఇచ్చిన షాక్ నుంచి నెమ్మదిగా కోలుకుంటున్న వేళ.. తీవ్రంగా వచ్చి పడిన సెకండ్ వేవ్ అతలాకుతలం చేసింది.
మొదటి వేవ్ కంటే తీవ్రత ఎక్కువగా ఉండటంతో దేశీయంగా ప్రజలే కాదు..సంస్థలు ఇబ్బందులకు గురవుతున్నాయి. ఇలా సెకండ్ వేవ్ తాకిడిని గురైన ప్రధాన రంగాల్లో విమానయాన రంగం ఒకటి.
దేశీయంగా విమాన ప్రయాణాలు తగ్గించేయటం.. ప్రయాణానికి 72 గంటల ముందు తప్పనిసరిగా కొవిడ్ నెగెటివ్ టెస్టు ఉండాలన్న నిబంధనను పలు రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. దీంతో.. విమాన ప్రయాణాలు తగ్గిపోయాయి. దీనికి తోడు.. పెరిగిన కేసుల ప్రభావం కూడా విమానయానం మీద పడింది. దీంతో.. ఈ పరిశ్రమ దారుణంగా ప్రభావితమైంది.
ఈ రంగానికి కాస్త ఊపిరి ఇచ్చేందుకు కేంద్రం కొత్త నిబంధనను తీసుకురావాలన్న యోచనలో ఉంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. రెండు వ్యాక్సిన్ డోసులు పూర్తి అయిన వారికి.. దేశీయ విమానయానానికి ముందు సమర్పించాల్సిన నెగెటివ్ రిపోర్టు అవసరం లేకుండా చేయాలని భావిస్తోంది.
దీనికి సంబంధించిన నిబంధనను దేశ వ్యాప్తంగా అమలు చేయాలన్న యోచనలోకేంద్రం ఉన్నట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించిన అంశాలపై కేంద్రం పలు రాష్ట్రాలతో చర్చిస్తోంది. దేశీయ ఫ్లైట్ జర్నీకి ముందు నెగెటివ్ రిపోర్టు చూపించాలన్న నిబంధనను ఎత్తేస్తే.. విమానయానం కొంతమేర పుంజుకునే వీలుందంటున్నారు.