నేను…బాలు..కొన్ని జ్ఞాపకాలు
కైలాసంలో… శివతాండవం ఆగింది…! డమరుకం పేలింది…! రుద్రాక్ష రాలింది…!
ఏకబిల్వమ్… శివార్పణం అయిపోయింది!!
సింహపురిలో శివకేశవులిద్దరిమీదా హరికథలు చెప్పుకుంటూ ఏడాదికి ఒకసారి త్యాగరాజ ఆరాధనోత్సవాలు సమయంలో ఉంఛవృత్తి చేసి, పరమపవిత్రమైన జీవితం గడుపుకుంటున్న శ్రీపతి పండితారాధ్యుల సాంబ మూర్తి, శకుంతలగారి ఇంట బంగారు పంట… బాలు.
ఎస్.పి.బి… అనే బీజాక్షర సహిత పుంభావ సరస స్వర సరస్వతితో నా జ్ఞాపకాలు….
తొలి పరిచయం… నిడదవోలులో…. జవ్వాది రామారావు గారి కళాసంస్థ…. మా ‘కొక్కొరొక్కో’ నాటిక వేసిన సందర్భంలో మాకు ప్రథమ బహుమతి వస్తే… ముఖ్య అతిథి అయిన బాలు గారు నన్ను, తల్లావజ్ఝల సుందరాన్ని కావలించుకుని ‘‘మీలాంటి వాళ్ళు ఉండాల్సింది హైదరాబాదులో కాదు…. అర్జెం టుగా మద్రాస్ రండి’’ అని ప్రోత్సహిం చిన సంస్కారి.
‘కళాసాగర్’ నాటక పోటీల్లో; ప్రథమ బహుమతి మళ్ళీ ‘కొక్కొరొక్కో’కి వస్తే… ‘‘వీళ్ళు సామాన్యులు కాదు’’ అని… నేను, సుందరం స్టేజి ఎక్కి బహుమతి అందుకునే వరకూ ఆడిటోరియంలో అందరి చేత చప్పట్లు కొట్టించిన సహృదయుడు బాలు.
నా మొదటి చిత్రం ‘కంచు కవచం’ రికార్డింగ్…. నేను డైలాగ్స్ రాసిన సినిమా లో వేటూరి రచన, బాలు పాట …. అలా చూస్తూ ఉండిపోయా… నా కల పాటై బాలు నోట వినిపిస్తోంది. కాళ్ళకు దణ్ణం పెడితే; గుండెలకు హత్తుకుని… ఎత్తుకుని నెత్తినెట్టుకునే మనిషి!
తర్వాత…. వంశీ– ఇళయరాజా గారి కాంబినేషన్లో ఎన్ని పాటలు… ‘ఆలాపన’, ‘లేడీస్ టైలర్’, ‘శ్రీకనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్’, ‘చెట్టు కింద ప్లీడర్’లోని ‘చల్తీ కా నామ్ గాడి, చలాకి వన్నెలేడి’…! ఎన్ని రికార్డింగ్ థియేటర్లలో పలకరింపుతో కలిసి బాతాఖానీలో…. టిఫిన్సో్ల. తమాషా ఏమిటంటే సింగర్లు తిండి, నీళ్ళ విషయంలో పరమ జాగ్రత్తగా ఉంటారు… బాలుకు అదేమీ లేదు. గుప్పెడు వక్కపొడి, ఎప్పుడైనా సిగరెట్, కుదిరితే తాంబూలం. గొంతును ఈశ్వరుడికి ఎల్.ఐ.సి చేసినట్టుండేవాడు.
నేను బాలు కలిసి కొన్ని సినిమాల్లో నటించే సమయాల్లో నా సాహిత్యం, ముఖ్యంగా ‘ఆటగదరా శివ’, ’శభాష్ రా శంకరా’ విని ముగ్ధుడైపోయేవాడు. ‘శభాష్ రా శంకరా’ సీడీని శ్రీపతి పండితారాధ్యుల బాల సుబ్రహ్మణ్యానికి అంకితం ఇస్తూ… ‘భాషా శ్రీపతికి… పాటల పండితుడికి… సుబ్బరమైన బాలుడికి…’ అని చమత్కరిం చాను…
కొత్తగా రాసిన ‘శివ చిలకలు’ అనే శివతత్వాలను వినిపించి, వీటిని మీరు పాడాలి అంటే… కన్నీరు నిండిన కళ్ళతో, ‘వద్దు భరణి, వీటికి నీ గొంతే కరెక్ట్…. కొంచం ‘రా’ గా ఉంటే మంచిది…. శుభం భూయాత్‘ అన్నాడు.
నేను, జనార్దన మహర్షి అమీర్‌పేట్‌లో కొనుక్కున్న మొదటి 2 బెడ్ రూమ్ ఫ్లాట్ గృహప్రవేశానికి పిలిస్తే వచ్చి, మాతో భోజనం చేసి, సరదాగా గడిపి వెళ్తే… మా బంధువులంతా అలా అవాక్కయి చూస్తూ ఉండిపోయారు…
‘బాలు మా ఇంట్లో అడుగు పెట్టేడంటే సాక్ష్యాత్తు ఆ సుభ్రహ్మణ్య స్వామే వచ్చినట్టు పొంగిపోయాం‘.
ఆస్ట్రేలియాలో ఉండే కోడూరి రామమూర్తి గారు బాలుకి, నాకు కామన్ ఫ్రెండ్. బాలు ‘భగవద్గిత’ పాడేరు… (ఈ సంగతి చాలా మందికి తెలీదు). సి. నారాయణ రెడ్డిగారు, మిగతా ప్రముఖులు ముఖ్య అతిధులుగా చాలా వైభవంగా ‘సత్య సాయి నిగమాగమంలో’ ఆవిష్కరణ జరిగింది… ఆ కార్యక్రమానికి నేనే యాంకర్ని. కానీ అదెందుకో పాపులర్ కాలేదు. బహుశా భగవద్గీతను ఘంటసాల మాష్టారుకి, బిల్వాష్టకాన్ని బాలుగారికి కేటాయించాడేమో ఆ పరమేశ్వరుడు.
నా 25 సంవత్సరాల సినీ యాత్రని ‘వెండి పండగ’ పేరుతో రవీంద్ర భారతిలో సంగం అకాడమీ సంజయ్ కిశోర్ నిర్వహిస్తే చాలామంది సినీ ప్రముఖులు వచ్చారు. చివరిగా బాలు అడక్కుండానే భక్త కన్నప్పలో పద్యాలు పాడి, ప్రేక్షకులంతా ‘స్టాండింగ్ ఒవేషన్’ ఇచ్చేలా చేసి తన వాత్సల్యాన్ని ప్రకటించాడు. వెండిపండగ నాడు నాకదో బంగారు బహుమతి.
ఒకసారి చెన్నైలో బాలు గారి ఇంట్లో చరణ్ తియ్యబోయే ఒక ఆర్ట్ సినిమా గురించి చర్చించుకున్నాం. అక్కడే డిన్నర్ చేసి మీద దిగి వస్తుం డగా, కాలు జారి, నా బొటనవేలు ఫ్రాక్చర్ అయ్యింది. హైదరాబాద్ వచ్చాకా దాదాపుగా ప్రతిరోజా ఫోన్ చేసి ‘కాలు ఎలా ఉంది భరణి’ అని తగ్గేవరకూ పరామర్శిస్తూ ఉండేవాడు ఆయన.
మేమెప్పుడూ కలిసినా తరచూ వేటూరి వారి సాహిత్యంలో చమక్కుల్నీ, ఆ భాషా సౌందర్యాన్ని, భావ శబలతని తల్చుకుని మురిసిపోతూ ఉండేవాళ్ళం. ‘వేటూరి వంటి వారు వెయ్యేళ్ళకోసారి పుడతారేమో’ అని నేనంటే… ‘మా అందరి ఆయుష్షు పోసుకుని నువ్వు వెయ్యేళ్ళు బతకాలయ్యా సుందరయ్యా’ అని అంటుండేవాడు బాలు.
మేము నీ విషయంలో అదే కోరుకున్నాంగా… కానీ ఏది? దెబ్బకొట్టేశావుగా బాలు!
ఇక ‘మిథునం’ సినిమా అనుకున్నప్పుడు మొదట అప్పదాసు వేషం నేను వేద్దామని అనుకుని, చాలా మంది హీరోయిన్లు అంటే హిందీ రేఖ… సుహాసిని… రాధిక… వై. విజయ… శైలజ (బాలు గారి చెల్లి), మృణాళిని (రచయిత్రి) ఇలా చాలామందిని అనుకున్నాకా… లక్ష్మి గారు, బాలు ఫిక్స్ అయ్యారు.
బాలు గారికి కథ వినిపిస్తే బావుందని మెచ్చుకుని ‘ఔను, నువ్వూ నటుడివే కదయ్యా! ఇంత మంచి పాత్ర నువ్వే వెయ్యచ్చుగా’ అన్నాడు. అప్పుడు నేనన్నాను ‘స్వామీ నేనే రాసి, నేనే వేసి, నేనే తీస్తే, చివరికి నేనే చూసుకోవాల్సొస్తుందేమో’ అంటే నవ్వేసి చాలా తక్కువ పారితోషికం తీసుకొని అప్పదాసు పాత్రకి జీవం పోశాడు.
‘మిథునం’ నిర్మాత ముయిద ఆనందరావు గారి ఊరు వావిలవలసలో షూటింగ్. ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర మూడు నెలల ముందు నుంచే అక్కడికి వెళ్ళి, ఆ పాడుబడ్డ పెంకుటింటిని సరిచేసి, అక్కడ నేను చెప్పిన అన్ని మొక్కలనీ పెంచి… సర్వాంగ సుందరంగా, పరమ సహజంగా తీర్చిదిద్దాడు. బాలుగారు లొకేషన్ చూడగానే వాళ్ళావిడ సావిత్రి గారితో ‘మనం రిటైర్ అయ్యాకా ఇలాంటి పర్ణశాలలో ఉండాలోయి’ అన్నాడు.
ఏది బాలూ? ఆవిడ సావిత్రే … నువ్వే పేద్ద సత్యవంతుడివి…. మాట తప్పావు!!!
రోజూ మధ్యాహ్నం బ్రేక్ చెప్పగానే తోటలో ఒక బెండకాయని కొరుక్కు తింటూ ఉండేవాడు. ‘ఆరోగ్యంగా ఉండాలంటే ఇలాంటి పచ్చివి తింటూ ఉండాలయ్యా’ అని ముచ్చట పడుతూ ఉండేవాడు. బాలుని సంతోషపెడదామని ప్రత్యేకంగా ఒక వంట మనిషిని పెట్టి వండిస్తే సాయంత్రం ఆయన నవ్వుతూ, ‘నువ్వు ప్రేమ చేత అన్నీ వండించేవు గానీ, నేను రెండు గరిటెల కన్నా ఎక్కువ తినకూడదయ్యా…. బేరియాట్రిక్ సర్జరీ చేయించుకున్నాగా’ అన్నాడు. నేను ఎంత బాధపడ్డానో! కడుపునిండా అన్నం పెట్టేమన్న తృప్తి కూడా లేకుండా పోయింది అప్పదాసూ!!
బాలు, లక్ష్మి గార్లిద్దరూ పొద్దున్నే 8 గంటలకు వచ్చేసేవారు లొకేషన్‌కి. ఒంటిగంటకు బ్రేక్. మళ్ళీ 3 గంటలకే షూటింగ్. 6 గంటలకి పేక్ అప్. క్లైమాక్స్ మాత్రం ఒకటి, రెండు రోజులు అర్ధరాత్రి వరకూ జరిగింది… ఇద్దరూ విసుక్కున్నారు. కెమెరామ్యాన్ రాజేంద్ర ప్రసాద్‌ని బాలు కేకలేశాడు కూడా! సినిమా చూశాక, కెమెరామ్యాన్‌కి సభాముఖంగా సారీ చెప్పి కావలించుకున్నాడు. దట్ ఈజ్ బాలు!
షూటింగ్ చివరిరోజుల్లో ఒక సీన్ పొరపాటున డ్రెస్ మార్చి, మళ్ళీ తియ్యాల్సొచ్చింది. ఆయనకీ కోపం వచ్చి లొకేషన్లో అన్యాపదేశంగా అసిస్టెంట్ డైరెక్టర్లని కేకలేశాడు. తప్పెవరు చేసినా బాధ్యత దర్శకుడిగా నాదే కదా… నేను హర్ట్ అయ్యాను… రాత్రి కన్నీళ్ళు పెట్టుకున్నాను. రెండు రోజులు మేము మాట్లాడుకోలేదు.
సినిమా అయిపోయింది. నేను ప్యాక్ అప్ చెప్పేశాను.
ఆయన్ని సాగనంపడానికి ముభావంగా కార్ దగ్గరకొచ్చాను. ఆయన చొక్కా పట్టుకు లాగి, కావలించుకున్నారు. నేను గాఢంగా కావలించుకుని ఏడ్చేశాను. నన్ను సముదాయిస్తూ, ‘చాలా గొప్ప సినిమా తీశావు భరణీ! పది కాలాల పాటు గుర్తుండిపోయే సినిమా తీశావు. నీకు అఖండమైన పేరొస్తుంది. నీతో పాటు నాకూనూ‘ అన్నాడు. కాళ్ళ మీద పడిపోతే లేవనెత్తి ముద్దెట్టుకున్నాడు. ఆ ముద్దే నాకు ఆస్కార్ అవార్డు!
ఈ సినిమాలో టైటిల్ సాంగ్ బాలు గారితో కాకుండా జేసుదాస్ గారితో పాడించాడు వీణాపాణి. షూటింగ్ టైంలో ఆ సంగతి బాలుకి చెప్పలేదు. షూటింగ్ చివర రోజున వినిపిస్తే ‘నా కోసం మా అన్న పాడేడా!’ అని పరమానందపడిపోయాడు. సినిమా రిలీజ్ అయిన తరువాత ఒకసారి నాతో ఇలా అన్నాడు ‘ఎప్పుడైనా నేను జీవిత చరిత్ర రాస్తే ‘మిథునా’నికి ముందు, ‘మిథునా’నికి తరువాత’ అని… అంతకన్నా ఏ దర్శకుడికైనా ఏం ప్రశంస ఉంటుంది? శ్రీపతితో కలయిక… ఐశ్వర్యం. పండితారాధ్యుడితో పరిచయం… యోగం. బాలసుబ్రహ్మణ్యంతో స్నేహం… వ్యసనం…
ఇదీ కైలాసమే!
కనకమహాసభ… ఐశ్వర్యానికి నిలయం…
మొత్తం బంగారంతో మెరిసిపోతోంది. అంతెత్తు వెండి నంది తన ఉచ్ఛ్వాస, నిస్వాసాలతో బంగారు ఉయ్యాల ఊపుతోంది. ఆదిదంపతులిద్దరూ కూర్చున్నారు. ఒకవైపు అమ్మవారు…మరోవైపు అయ్యవారు.
పార్వతీదేవి ఒళ్ళో నెల‘బాలుణ్ణి’ ఒద్దికగా బజ్జోపెట్టుకుని జోల పాడుతున్న హేల! చిరునవ్వుతో కన్నులరమూసిన పరమేశ్వరుడి లీల!
వ్యాసకర్త : తనికెళ్ల భరణి, ప్రముఖ నటుడు, రచయిత, దర్శకుడు