అలనాటి నటి, మాజీ ఎంపీ, బీజేపీ నేత జయప్రదకు ఉత్తరప్రదేశ్ రాంపూర్ ప్రత్యేక కోర్టు షాకిచ్చింది. కంటెప్ట్ ఆఫ్ కోర్ట్ కింద జయప్రదకు ఆ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2019 లోక్ సభ ఎన్నికల సమయంలో ఎన్నికల నియమావళిని ఉల్లఘించిన కారణంతో జయప్రదపై వేర్వేరుగా 2 కేసులు నమోదయ్యాయి. అయితే, ఆ కేసు విచారణకు జయప్రద ఒక్కసారి కూడా హాజరుకాలేదు. దీంతో, కోర్టు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీ చేసింది.
రాబోయే మంగళవారం విచారణకు ఆమెను హాజరుపరచాలని రాంపూర్ ఎస్పీని కోర్టు ఆదేశించింది. గతంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కేసులో బహుజన్ సమాజ్ పార్టీ మాజీ ఎమ్మెల్యే అలీ యూసుఫ్, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సంజయ్ కపూర్లకు కూడా ఇదే కోర్టు శిక్ష విధించింది. దీంతో, జయప్రద రాబోయే మంగళవారం విచారణకు హాజరు కాకుంటే ఆమెపై కఠిన చర్యలు తీసుకునే అవకాశముందని తెలుస్తోంది.
2019 ఎన్నికలకు ముందు ఎస్పీకి గుడ్ బై చెప్పి కాషాయ కండువా కప్పుకున్నారు జయప్రద. జయప్రదకు వ్యతిరేకి అయిన ఎస్పీ నేత ఆజం ఖాన్ పై ఆమె పోటీకి దిగారు. రాంపూర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా బరిలోకి దిగిన జయప్రద ఆజం ఖాన్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఎస్పీలో ఉన్నపుడు కూడా జయప్రద, ఆజం ఖాన్ ల మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమనేది. మరోవైపు, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ లేదా తెలంగాణ నుంచి జయప్రద పోటీ చేయబోతున్నారని కూడా పుకార్లు వినిపిస్తున్నాయి.
ఈ ఏడాది జులైలో రాజమహేంద్రవరంలో జరిగిన బీజేపీ గర్జనలో పాల్గొన్న జయప్రద…తాను కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల రాష్ట్ర రాజకీయాలకు దూరమయ్యానని అన్నారు. ఇక, ఆంధ్రప్రదేశ్‌ను అప్పుల ప్రదేశ్‌గా మారుస్తున్నారంటూ జగన్ పాలనపై జయప్రద విమర్శలు గుప్పించారు. తెలుగు రాష్ట్రాల్లో మహిళలకు ఎలాంటి రక్షణ లేకుండాపోయిందని, ఏపీతో పాటు తెలంగాణలో బీజేపీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. బీజేపీ అధిష్టానం ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా పోటీ చేసేందుకు సిద్ధమని జయప్రద కామెంట్లు చేయడం విశేషం. తన సొంత ఊరు రాజమండ్రి నుంచి ఎంపీగా రాబోయే ఎన్నికల్లో జయప్రద పోటీ చేయబోతున్నారని తెలుస్తోంది. ఇందుకే, యూపీ రాజకీయాలకు దూరంగా ఉంటున్న జయప్రద ఏపీ ప్రజలకు సేవ చేస్తానని గతంలో ప్రకటించారు.