నయనతార పెళ్లి గురించి చర్చ ఇప్పటిది కాదు. దశాబ్దంన్నర కిందట శింబుతో ప్రేమలో ఉన్నపుడే ఆమె పెళ్లి గురించి చర్చ మొదలైంది. కానీ ‘బ్యాడ్ బాయ్’ ఇమేజ్ ఉన్న శింబు నుంచి చాలా త్వరగానే బయటపడిందామె. ఆ తర్వాత బహుముఖ ప్రజ్ఞాశాలి ప్రభుదేవాతో బంధం మొదలై.. ఇక పెళ్లే తరువాయి అనుకున్న సమయంలో వారి రిలేషన్ చెడింది. ఆ తర్వాత కొన్నేళ్లు ఒంటరిగా ఉండిపోయిన నయన్.. ఆపై దర్శకుడు విఘ్నేష్ శివన్‌కు దగ్గర కావడం తెలిసిందే.
విఘ్నేష్‌తో నయన్ బంధం మొదలై దాదాపు ఐదేళ్లు కావస్తోంది. ముందు నయన్ స్థాయికి అప్‌కమింగ్ డైరెక్టర్ అయిన విఘ్నేష్ తగ్గవాడేనా.. నిజంగా అతణ్ని ఆమె ప్రేమిస్తోందా అన్న సందేహాలు కలిగాయి. కానీ కొంత కాలానికి వారి బంధం బహిర్గతం అయిపోయింది. కొన్నేళ్ల నుంచి కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది ఈ జంట. వీరి పెళ్లి ఇదిగో అదిగో అంటూ మూడేళ్ల ముందు నుంచి మాట్లాడుకుంటూనే ఉన్నారు. గతంలో మీడియాలో, సోషల్ మీడియాలో పెళ్లికి ముహూర్తాలు పెట్టేసి దాదాపుగా వారి పెళ్లి అయిపోయినట్లే ప్రచారం జరిగిపోయింది.
కానీ తర్వాత ఆ వార్తలు జోక్స్‌గా మారిపోయాయి. అందుకే ఈ మధ్య నయన్ పెళ్లి అంటే జనాలు చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు. వీరి పెళ్లి గురించి వార్తలను నమ్మట్లేదు. ఐతే ఇప్పుడు ఈ జోక్స్ అన్నీ కట్టిపెట్టాల్సిందే అని.. నిజంగానే వారి పెళ్లికి డేట్ ఫిక్స్ అయిపోయిందని అంటున్నారు.
జూన్ 9న, అంటే ఇంకో నెల రోజుల్లోనే నయన్, విఘ్నేష్ అధికారికంగా ఒక్కటి కాబోతున్నారు. బేసిగ్గా నయనతార క్రిస్టియన్. కానీ ప్రభుదేవాతో ప్రేమలో ఉన్నపుడే ఆమె హిందూ మతంలోకి మారిపోయింది. ఇప్పుడు ఆమె హిందువుగానే కొనసాగుతోంది. విఘ్నేష్‌తో కలిసి కొంత కాలంగా ఆమె గుళ్లు గోపురాలకు తెగ తిరిగేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ జంట పెళ్లికి ముందు కొన్ని దోష నివారణ పూజలు కూడా చేయించుకున్నట్లు వార్తలొచ్చాయి. మొత్తానికి ఆల్ క్లియర్ అనుకుంటున్న ఈ జంట ఇక పెళ్లికి రెడీ అయిపోయింది. సినిమాల్లో ఈ మధ్య నయన్ క్రేజ్ కూడా తగ్గడం, కెరీర్ చరమాంకానికి వచ్చేసినట్లు కనిపిస్తుండటంతో ఇంకా పెళ్లి విషయంలో ఆలస్యం చేయొద్దని ఫిక్సయినట్లు తెలుస్తోంది.
. #Nayanathara and @VigneshShivN, 9th June, Thirupathi!! pic.twitter.com/uWaMycTu6J
— Pramod Madhav (@PramodMadhav6) May 7, 2022