యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ల కాంబోలో దర్శక ధీరుడు ‘మహారాజ’మౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల మోత మోగించిన సంగతి తెలిసిందే. తారక్, చెర్రీలు నువ్వా నేనా అన్నట్లు పోటీపడి నటించడం…రాజమౌళి మరోసారి తన మార్క్ డైరెక్షన్ తో మెప్పించడంతో ఈ చిత్రం అమెరికా సహా ఓవర్సీస్ లోని ప్రేక్షకులనూ ఆకట్టుకుంది. ఈ సినిమాతో చెర్రీ, తారక్ లు పాన్ ఇండియాతో పాటు పాన్ వరల్డ్ హీరోలుగా మారిపోయారు. దీంతో, ఈ సారి ఆస్కార్ బరిలో ఆర్ఆర్ఆర్ కు అవార్డుల పంట పండుతుందని భారీ అంచనాలున్నాయి.
ఈ క్రమంలోనే తాజాగా ఆ దిశగా తొలి అడుగుపడింది. ఆస్కార్ అవార్డులకు ఆర్ఆర్ఆర్ చిత్రంంలోని నాటు నాటు పాట షార్ట్ లిస్ట్ అయింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆర్ఆర్ఆర్ చిత్రం నుంచి ఆ పాట షార్ట్ లిస్ట్ అయింది. ఆ పాటతోపాటు ‘ద లాస్ట్ ఫిల్మ్ షో’ అనే గుజరాతీ సినిమా అంతర్జాతీయ ఉత్తమ ఫీచర్ ఫిలిం కేటగిరీలో షార్ట్ లిస్ట్ అయింది. ఎన్టీఆర్, చెర్రీలు నాటు నాటు అంటూ నాటు స్టెప్పులతో అదరగొట్టడంతో ఆ పాట ఆస్కార్ అవార్డు తప్పక గెలుస్తుందని అభిమానులు కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఈ ఘనత సాధించిన భారత చలన చిత్ర తొలి పాటగా నాటు నాటు రికార్డు సృష్టించింది.
బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో మొత్తం 81 పాటలు బరిలో నిలిచారు. చివరకు నాటు నాటుతోపాటు 15 పాటలు షార్ట్ లిస్ట్ అయ్యాయి. అవతార్-2 2లోని నథింగ్ ఈజ్ లాస్ట్ పాట కూడా షార్ట్ లిస్ట్ అయింది. ఆస్కార్ అవార్డులు అందించే ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ 2023కి గాను ఆస్కార్ కోసం పోటీ పడుతున్న పది కేటగిరీల్లో షార్ట్ లిస్ట్ అయిన చిత్రాల జాబితాను విడుదల చేసింది.
నామినేషన్ల ఓటింగ్ జనవరి 12-17 వరకు కొనసాగనుండగా, జనవరి 24న నామినేషన్లను ప్రకటిస్తారు. 95వ అకాడమీ అవార్డుల (ఆస్కార్) ప్రదానోత్సవం మార్చి 12న హాలీవుడ్‌లోని డాల్బీ థియేటర్లో జరుగుతుంది.