టాలీవుడ్ సీనియర్ నటుడు, నిర్మాత నరేష్….నటి పవిత్ర లోకేష్ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కొంతకాలం పాటు లివింగ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్న ఈ జంట ఇటీవల పెళ్లి చేసుకున్నారు. అయితే, తన జీవితంలో జరిగిన యదార్థ ఘటనల ఆధారంగానే నరేష్, పవిత్రలు మళ్లీ పెళ్లి అనే చిత్రంలో నటించారు. రేపు ఈ సినిమా విడుదల నేపథ్యంలో నరేష్ మూడో భార్య రమ్య తాజాగా ఆ చిత్రంపై విమర్శలు గుప్పించారు.
ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలు అభ్యంతరకరంగా ఉన్నాయని, తన పరువుప్రతిష్టలకు భంగం కలిగించేలా ఉన్నాయని ఆమె ఆరోపించారు. ఈ క్రమంలోనే ఆ చిత్ర విడుదలను నిలిపివేయాలంటూ కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎమ్మెస్ రాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈనెల 26న థియేటర్లలో రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ఈ మూవీ ప్రమోషన్స్ లో నరేష్ బిజీగా ఉన్నారు.
అయితే, తన ఆస్తి కోసం తనను పవిత్ర లోకేష్ పెళ్లి చేసుకోలేదని, అలాగే ఆమె అందం చూసి తాను పెళ్ళికి ఒప్పుకోలేదని నరేష్ చెప్పారు. ఒకరికొకరు నచ్చి వివాహం చేసుకున్నామని, ఈ విషయంపై అనవసర రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదని నరేష్ అన్నారు. తాజాగా ఈ చిత్రాన్ని విడుదల చేయొద్దంటూ రమ్య కోర్టును ఆశ్రయించడంతో తీర్పు ఏ రకంగా ఉండబోతుంది అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ ఏర్పడింది.