జాతీయ ఉపాధి హామీ పథకం బకాయిల చెల్లింపు విషయంలో జగన్ సర్కార్ కు ఏపీ హైకోర్టు పలు మార్లు మొట్టికాయలు వేసిన సంగతి తెలిసిందే. సుమారు రూ.2500 కోట్లు బకాయిలు పెండింగ్లో ఉండడంపై విమర్శలు వస్తున్నాయి. పెండింగ్ బిల్లులు చెల్లించాలని గత ఏడాది జనవరి 8న కోర్టు ఆదేశించినా ఇప్పటివరకు ఎందుకు అమలు చేయలేదని ప్రభుత్వాన్ని హైకోర్టు నిలదీసింది. అంతేకాదు, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాలేదని చెప్పిన ప్రభుత్వంపై హైకోర్టు మండిపడింది.
ఈ విషయంపై సుప్రీంకోర్టులో ఎందుకు అప్పీల్ చేయలేదని ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో నేడు జరిగిన ఈ కేసు విచారణ సందర్భంగా జగన్ సర్కార్ పై ఉన్నత న్యాయస్థానం మరోమారు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉపాధి హామీ పనుల బిల్లులకు సంబంధించి కేంద్రం కేటాయించిన నిధుల్లో రూ.1991 కోట్లు రాష్ట్రం దగ్గర ఖర్చు కాకుండా మిగిలే ఉన్నాయని కోర్టు దృష్టికి రావడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని స్వయంగా కేంద్రం హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో స్పష్టం చేయడంతో జగన్ సర్కార్ గుట్టురట్టయినట్లయింది.
ఈ నేపథ్యంలో జగన్ ప్రభుత్వంపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఉపాధి హామీ పథకం నిధులను ఇతర పథకాలకు మళ్లిస్తున్నారా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు నిలదీసింది. తన 75 శాతం వాటా నిధులను కేంద్రం ఎప్పటికప్పుడు విడుదల చేస్తున్నా బిల్లులు ఎందుకు చెల్లించడం లేదని నిలదీసింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఉపాధి పనులన్నింటిలో అక్రమాలు జరిగాయని ప్రభుత్వం భావిస్తోందా? అని ప్రశ్నించింది. విజిలెన్స్ విచారణ పేరుతో మొత్తం బిల్లులు పెండింగ్ లో పెట్టడం సరికాదని స్పష్టం చేసింది.
అయినా, కేంద్రం ఇచ్చిన సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం తనవద్ద ఉంచుకోవడమేమిటని హైకోర్టు నిలదీసింది. కోర్టులో పిటిషన్ వేసిన వారిలో ఎంతమందికి బకాయిలు చెల్లించారు? ఇంకా చెల్లించకుంటే దానికి కారణాలేంటి? కేంద్రం నిధులిచ్చినా రాష్ట్రం బిల్లులు చెల్లించకుండా ఎందుకు తన వద్దే ఉంచుకుంది? ఈ వివరాలను కోర్టు ముందు ఉంచండి’’ అని జగన్ సర్కార్ ను హైకోర్టు ఆదేశించింది. ఈ వ్యవహారంలో దాఖలైన 452 పిటిషన్ల విచారణను ఈ నెల 23కి వాయిదా వేసింది. ఈ రకంగా హైకోర్టులో అఫిడవిట్ సమర్పించి కేంద్రం జగన్ గుట్టురట్టు చేసినట్లయింది.