ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత కొంతకాలం నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. శనివారం మధ్యాహ్నం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రామ్మూర్తి నాయుడు మరణంతో నారా వారి కుటుంబ సభ్యులు విషాదంలో మునుగిపోయారు.
నేడు స్వగ్రామం నారావారిపల్లెలో రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు జరగబోతున్నాయి. నారా లోకేష్ దగ్గరుండి చిన్నాన్న భౌతికకాయాన్ని ఆదివారం ఉదయం బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో తిరుపతికి తరలించారు. తిరుపతి నుంచి రోడ్డు మార్గంలో నారావారిపల్లిలోని చంద్రబాబు నివాసానికి తీసుకొచ్చారు. రామ్మూర్తి కుమారులైన నారా రోహిత్, గిరీశ్ లు తీవ్ర దుఃఖంలో మునిగిపోవడంతో.. నారా లోకేష్ అన్ని తానై చూసుకుంటున్నారు.
మరోవైపు సోదరుడి అంత్యక్రియల కోసం సీఎం చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నుంచి స్వగ్రామం చేరుకున్నారు. చంద్రబాబుతో పాటు ఆయన భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి మరియు ఇతర కుటుంబసభ్యులు నారావారిపల్లె వచ్చారు. రామ్మూర్తి నాయుడు గారి పార్థివదేహానికి అఖరిసారిగా చంద్రబాబు, లోకేష్ నివాళులు అర్పించారు. రామ్మూర్తి నాయుడుని చివరి చూపు చూడడానికి కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు, బంధువులు, స్థానికులు భారీగా తరలివస్తున్నారు.
కాగా, ఈరోజు మధ్యాహ్నం 2:30 గంటలకు చంద్రబాబు నివాసం నుంచి నారా రామ్మూర్తి నాయుడు అంతిమయాత్ర ప్రారంభం కానుంది. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. నారావారిపల్లెలో అమ్మానాన్నలు సమాధులు ఉన్న చోటే నారా రామ్మూర్తి నాయుడుకి కూడా అంతిమ సంస్కారాలు చేయనున్నారని తెలుస్తోంది.