2014-19 మధ్యకాలంలో టిడిపి పాలనలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ముసుగులో స్కాం జరిగిందని, ఆ స్కాంలో ఆనాటి ఐటి శాఖా మంత్రి నారా లోకేష్ పాత్ర కూడా ఉందని సీఎం జగన్ తో పాటు వైసీపీ నేతలు ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తనపై చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపాలంటూ వైసీపీ నేతలకు లోకేష్ 24 గంటల ఛాలెంజ్ చేశారు. అయితే, వైసిపి నేతలు ఎవరు ఆ ఛాలెంజ్ పై స్పందించలేదు.
ఈ నేపథ్యంలో తాజాగా మంగళగిరి నియోజకవర్గం నడమర్రిలో ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో పాల్గొన్న లోకేష్….వైసీపీ నేతలపై విమర్శలు గుప్పించారు. ఎన్నికలకు ముందు, తర్వాత కూడా తనపై ఎన్నో ఆరోపణలు చేశారని, కానీ ఆ ఆరోపణలు నిరూపించాలని సవాల్ చేస్తే వైసిపి నేతలు పారిపోయారని లోకేష్ దుయ్యబట్టారు. పింక్ డైమండ్, దసపల్లా భూములు, అగ్రిగోల్డ్ స్కామ్, ఫైబర్ గ్రిడ్ స్కామ్ అంటూ ఇలా తనపై ఎంతో దుష్ప్రచారం చేశారని, కానీ ఒక్క ఆరోపణ కూడా జగన్ రెడ్డి గ్యాంగ్ నిరూపించలేకపోయిందని లోకేష్ మండిపడ్డారు.
చంద్రబాబుపై, తన పైన ఆరోపణలు చేసి పారిపోవడం ఏ1, ఏ2, వైసీపీ నేతలకు అలవాటేనని లోకేష్ ఎద్దేవా చేశారు. టిడిపి ఐదేళ్ల పాలనలో ఏ తప్పు చేయలేదని స్పష్టం చేశారు. ఈ మూడున్నరేళ్ళ పాలనలో 50 మంది టిడిపి నాయకులపై జగన్ అక్రమ కేసులు పెట్టారని, కానీ, ఒక్క కేసు కూడా నిలబడలేదని లోకేష్ అన్నారు. లక్షల రూపాయల ప్రజాధనం బొక్కుతున్న సాక్షి జీతగాడు సజ్జల ఏ అర్హతతో టిడిపి నేతలపై ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారని లోకేష్ నిలదీశారు.
తాడేపల్లి కొంప నుంచి వచ్చే కాగితం పట్టుకుని తప్పుడు ఆరోపణలు చేసే వారందరిపై పరువు నష్టం దావా వేస్తానని లోకేష్ వార్నింగ్ ఇచ్చారు. స్టాన్ ఫోర్డ్ లో తనతోపాటు చదువుకున్న వారంతా ఏడాదికి కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారని, డబ్బు కోసం తాను రాజకీయాలకు రాలేదని, ప్రజాసేవే తన లక్ష్యమని లోకేష్ అన్నారు. జగన్ తనను చూసి వణుకుతున్నారని, అందుకే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.