చిత్తూరు జిల్లాలోని పుంగనూరులో చంద్రబాబు పర్యటన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు పర్యటనను అడ్డుకునేందుకు వైసీపీ నేతలు వ్యూహం పన్నగా దానిని టిడిపి కార్యకర్తలు, నేతలు ఛేదించారు. ఈ క్రమంలోనే పుంగనూరు గొడవలకు చంద్రబాబే కారణమని, పోలీసులపై టీడీపీ కార్యకర్తలే బీరు బాటిళ్లు, రాళ్లతో దాడి చేశారని చిత్తూరు ఎస్పీ రిషాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. బాధ్యతగల ఎస్పీ హోదాలో ఉండి చిత్తూరు జిల్లా ఎస్పీ రిషాంత్ మాట్లాడిన తీరిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ నేపథ్యంలోనే రిషాంత్ రెడ్డికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, టీడీపీ అగ్రనేత నారా లోకేష్ వార్నింగ్ ఇచ్చారు. రిషాంత్ రెడ్డి కండువా వేసుకోని వైసీపీ కార్యకర్త అని, ప్రతిపక్ష నేత చంద్రబాబుపై వైసీపీ కార్యకర్తల దాడి ఆయనకు కనపడలేదని ఎద్దేవా చేశారు. మరో తొమ్మిది నెలలు ఓపిక పడితే రిషాంత్ రెడ్డి కళ్ళకు ఆపరేషన్ చేయించి అన్నీ కనిపించేలా చేస్తానని లోకేష్ డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు. నువ్వు ఐపీఎస్ కు అన్ ఫిట్, నువ్వు ఐపిఎస్ కాదు పిపిఎస్…పాపాల పెద్దిరెడ్డి పబ్లిక్ సర్వీస్ అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అంత సరదాగా ఉంటే పోలీస్ యూనిఫామ్ తీసేసి బులుగు కండువా వేసుకోవాలని లోకేష్ సూచించారు.
చంద్రబాబు రాష్ట్రంలో, రాయలసీమలో నీళ్లు పారించాలని చూస్తుంటే జగన్ మాత్రం రక్తపుటేరులు పారించేందుకు గొడవలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. నీళ్లు కావాలో రక్తం కావాలో రాష్ట్ర ప్రజలే నిర్ణయించుకోవాలని లోకేష్ పిలుపునిచ్చారు . అధికారంలో ఉన్న పార్టీని గొడవలు చేసి ఆ పార్టీనే బంద్ కు పిలుపునివ్వడం రాష్ట్ర చరిత్రలో తొలిసారి అని లోకేష్ ఎద్దేవా చేశారు. జగన్ పని అయిపోయిందని అందుకే ఇటువంటి దాడులకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. అసమర్ధులే ఇటువంటి పనులు చేస్తారని లోకేష్ అన్నారు. సింహం బయటకు రాగానే ప్యాలెస్ పిల్లి భయపడిందని, చంద్రబాబు అంటేనే హై వోల్టేజ్ అని ముట్టుకుంటే మాడి మసై పోతావని జగన్ కు వార్నింగ్ ఇచ్చారు.
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర చేస్తున్న సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో లోకేష్ ఈ వ్యాఖ్యలు చేశారు. పల్నాడు పౌరుషాల పురిటిగడ్డ అని, మాచర్ల మాస్ దెబ్బ అదిరిపోయిందని కార్యకర్తలలో, నేతలలో ఉత్సాహం నింపారు. మంచితనం మాచర్ల ప్రజల బ్లడ్ లో ఉందని, కులమతాలకు అతీతంగా సహ పంక్తి భోజనాలు ఏర్పాటు చేసిన గొప్ప వ్యక్తి పల్నాటి బ్రహ్మనాయుడు అని లోకేష్ కొనియాడారు. సాధారణ మహిళ నుండి పల్నాడు రాజ్యానికి మంత్రిగా ఎదిగిన వీర మహిళ నాగమ్మ అంటూ అభివర్ణించారు. ఇంత, ఘనచరిత్ర ఉన్న మాచర్ల గడ్డపై పాదయాత్ర చేయడం తన అదృష్టమని లోకేష్ అన్నారు. పల్నాడు ప్రాంతంలో లోకేష్ పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.