సీఎం జగన్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఏపీలో కక్షా రాజకీయాలు ఎక్కువయ్యాయని, ప్రజావేదిక కూల్చివేతతోనే ఈ తరహా రాజకీయాలకు జగన్ తెరతీశారని ఆరోపణలు వస్తోన్న సంగతి తెలిసిందే. ఇక, ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి చెందిన కార్యకర్తలు, నేతలపై దాడులు…టీడీపీ ఎమ్మెల్యేలపై అక్రమ కేసులు, అరెస్టులు….వంటి కార్యక్రమాలు జగన్ హయాంలో నిత్యకృత్యమయ్యాయని టీడీపీ నేతలు మండిపడుతున్నారు.
ఏపీలో లా అండ్ ఆర్డర్ సరిగా లేదని, శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోందని డీజీపీ సవాంగ్ కు టీడీపీ అధినేత చంద్రబాబు పలుమార్లు లేఖ రాసినప్పటికీ…స్పందన లేకపోవడంపైనా విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఇటీవల రాయల సీమలో ఫ్యాక్షన్ హత్యలు మళ్లీ మొదలయ్యాయని విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే జూమ్ ద్వారా నిర్వహించిన వర్చువల్ మీడియా సమావేశంలో జగన్ రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
టీడీపీ హయాంలో రాయలసీమలో నీరు మాత్రమే పారేదని, జగన్ హయాంలో రాయలసీమలో రక్తం ఏరులై పారుతోందని లోకేష్ నిప్పులు చెరిగారు. పచ్చగా, ప్రశాంతంగా ఉన్న సీమలో ఫ్యాక్షన్ రాజకీయాలతో రక్తపాతం సృష్టిస్తున్నారని దుయ్యబట్టారు. కర్నూలులో జగన్ పై చేసిన వ్యాఖ్యల గురించి ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు లోకేష్ ఈ రకంగా సమాధానమిచ్చారు.
ఓ ముఖ్యమంత్రిని కాల్చమని, చొక్కాపట్టుకోమని, చెప్పుతో కొట్టమని జగన్ రెడ్డిలా తాను చెప్పలేదని లోకేష్ అన్నారు. చంద్రబాబును కాల్చి చంపాలంటూ జగన్ గతంలో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనే పరోక్షంగా లోకేష్ ఈ విషయాన్ని ప్రస్తావించినట్లు కనబడుతోంది. తాను జగన్ స్థాయికి దిగజారలేదని లోకేష్ నర్మగర్భంగా చెప్పారని అనుకుంటున్నారు.
ఉద్యోగ క్యాలెండర్ ఓ ఫేక్ క్యాలండెర్ అని, 2.30లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పిన జగన్ రెడ్డి ఇపుడు 10 వేల ఉద్యోగాలు భర్తీ చేయడం ఏమిటని ప్రశ్నించారు. జులై చివరలో పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామని అంటున్నారని, దేశంలో పరీక్షలు రద్దు చెయ్యని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని మండిపడ్డారు. పరీక్షల నిర్వహణ ఒక సూపర్ స్ప్రెడర్ ఈవెంట్ అని, ఒక్క విద్యార్థి చనిపోయినా అది ప్రభుత్వ హత్యేనని లోకేష్ అన్నారు. పొలిటిషియన్ గా కాదు..ఓ తండ్రిలా ఆలోచించి పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నానని అన్నారు.
పరీక్షల రద్దు నిర్ణయాన్ని వెంటనే అఫిడవిట్ ద్వారా సుప్రీం కోర్టుకి తెలపాలని డిమాండ్ చేశారు. పరీక్షలు రద్దు చేయకుంటే తీవ్రస్థాయిలో ఉద్యమిస్తామని వార్నింగ్ ఇచ్చారు. జగన్ ప్యాలెస్‌కి కూతవేటు దూరంలో ఒక యువతిపై గ్యాంగ్ రేప్ జరగడం దారుణమని, టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టే పోలీసులు ఓ అమ్మాయికి అన్యాయం జరుగుతుంటే ఏమయ్యారని నిలదీశారు.
సొంత చెల్లెళ్లకే న్యాయం చేయలేనోడు అన్న కాదు దున్న అని వ్యాఖ్యానించారు. ఆడపిల్లకి అన్యాయం జరిగితే గన్ కంటే ముందొస్తాడు జగన్ అంటూ పంచ్ డైలాగులేశారన్నారు. ముఖ్యమంత్రి ఇంటి దగ్గర ఇంత అన్యాయం జరిగితే ఏడమ్మా జగన్? అని మండిపడ్డారు. అమరావతి ఉద్యమానికి భయపడి వేలమంది పోలీసుల్ని కాపలా పెట్టుకున్న పిరికి పంద జగన్ పాలనలో మహిళా భద్రత ప్రశ్నార్ధకమైందని లోకేష్ నిప్పులు చెరిగారు.